‘ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పదేండ్లలో దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులతో కలిపి రూ.12వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశాం. దేవరకొండ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరోసారి రవీంద్రకుమార్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిగిలి ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత కూడా నాదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రోడ్‌షోకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేవరకొండలో ఇండస్ట్రియల్ పార్క్, వేగంగా లిఫ్ట్‌ల నిర్మాణం పూర్తి చేస్తామని, కొత్త మండలాల ఏర్పాటు, గిరిజన బావోజీలకు ధూపదీప నైవేద్యం కింద ప్యాకేజీలు అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంపై సీఎం కేసీఆర్‌కు ఉన్న కమిట్మెంట్ ఇంకెవరికీ ఉండదని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలను నమ్మొద్దని సూచించారు. ఈ నెల 30న దుమ్ము లేపుతూ, దమ్ము చూపుతూ కారు గుర్తుపై ఓట్లు పడాలని పిలుపునిచ్చారు. రోడ్‌షోకు పెద్దఎత్తున హాజరైన జనంతో దేవరకొండ
గులాబీయమైంది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్23(నమస్తే తెలంగాణ)/దేవరకొండ : బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన రోడ్‌షోకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో కరెంటు, తాగు, సాగునీరు లేదన్నారు. ఫ్లోరోసిస్ బారిన పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారం చూపేందుకు ఎవ్వరూ అడగకముందే సీఎం కేసీఆర్.. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, సాగు, తాగునీరు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌దే అన్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌తో సాధ్యమయ్యేవా? అని ప్రశ్నించారు. 55 ఏండ్లపాటు 11 సార్లు అధికారమిస్తే వాళ్లు చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క అవకాశమంటూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారని, వారితో తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ గెలుపుతో మరిన్ని పథకాల అమలుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఇస్తున్న ఆసరా పింఛన్‌ను రూ.5 వేలకు పెంచనున్నట్లు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.3వేల సాయం చేయనున్నట్లు చెప్పారు. మోదీ పాలనలో రూ.1,200 అయిన గ్యాస్ సిలిండర్‌ను 400రూపాయలకే ఇవ్వనున్నట్లు తెలిపారు. తెల్లకార్డులదారులందరికీ సన్నబియ్యం, కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామన్నారు.
ఇక అసైన్డ్‌భూములకు కూడా పూర్తి హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గొర్రెల పంపిణీని కూడా మిగిలి ఉన్న అందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలు కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఇవన్నీ కావాలంటే దేవరకొండలో రవీంద్రకుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం పైనా, ప్రజల పైనా కేసీఆర్‌కు ఉన్న కమిటిమెంట్ ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఉందా? అన్నది ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 30న దుమ్ము లేపుతూ, దమ్ము చూపుతూ కారు గుర్తుపై ఓట్లు పడాలన్నారు.
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన రోడ్‌షోలో ఎన్నికల ఇన్చార్జి గుత్తా అమిత్‌రెడ్డి, రాష్ట్ర నేతలు కేతావత్ బీల్యానాయక్, నేనావత్ కిషన్‌నాయక్, వడ్త్యా రమేశ్‌నాయక్, రమావత్ జగన్‌లాల్, హన్మంత్వెంకటేశ్గౌడ్, ఎంపీపీలు మాధవరం సునీతాజనార్దన్రావు, పద్మాహన్మానాయక్, వంగాల ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీలు మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, పస్నూరి సరస్వతమ్మ, కేతావత్ బాలూనాయక్, కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, వైస్ చైర్మన్ రహత్‌అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య, రమావత్ దస్రూనాయక్, లోకసాని తిరుపతయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు పల్లా ప్రవీణ్‌రెడ్డి, తూం నాగార్జున్‌రెడ్డి, వల్లపురెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్‌రావు, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మారుపాకుల సురేశ్‌గౌడ్, గాజుల ఆంజనేయులు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
దేవరకొండ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఎంతో కృషి చేశారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇంకా పలు సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆయనను మరోసారి గెలిపిస్తే వాటి పరిష్కార బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. దేవరకొండలో ఇండస్ట్రియల్ పార్క్, వేగంగా లిఫ్ట్‌ల నిర్మాణం పూర్తి, కొత్త మండలాల ఏర్పాటు, గిరిజన బావోజీలకు ధూప, దీప, నైవేద్యం కింద ప్యాకేజీలు, చందంపేట కంబాలపల్లి, రేగులగడ్డ, పాత కంబాలపల్లి, పొగిళ్ల భూ సమస్యలను పరిష్కరించి ఆ భూములకు రైతుబంధు ఇచ్చే కార్యక్రమం చేపడుతామన్నారు. దేవరకొండ ఖిలా అభివృద్ధిని రవీంద్రకుమార్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రవీంద్రకుమార్‌ను మరోసారి గెలిపించుకోవడం ద్వారానే వీటన్నింటికీ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మీరు గెలిపించే బాధ్యత తీసుకుంటే, నేను అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రూ.6,340 కోట్లతో డిండి ఎత్తిపొతల పథకం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరాజుపల్లి, గొట్టిముక్కల రిజర్వాయర్ల పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్‌లు పూర్తికావాలంటే మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లో మరో రూ.600 కోట్లతో లిఫ్ట్‌లు మంజూరు చేసుకొని పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
విద్య, వైద్యం, అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. మూడోసారి ముఖ్యమంత్రి కాగానే రైతులకు పెట్టుబడి సాయాన్ని దశల వారీగా ఎకరాకు రూ.16వేలు ఇవ్వనున్నారని, గ్యాస్ సిలిండర్‌ను రూ.400లకు, తెల్లరేషన్ కార్డు ఉన్న 93 లక్షల మందికి సన్నబియ్యం, రూ.5 లక్షల బీమా సౌకర్యం, సౌభాగ్యలక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు అందించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలువాలని కో రారు. కేతావత్ బీల్యానాయక్, నేనావత్ కిషన్‌నాయక్, వడిత రమేశ్, జగన్‌లాల్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి కేటీఆర్ రోడ్‌షో సందర్భంగా దేవరకొండ పట్టణం గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్లు దర్శనమిచ్చాయి. 3:20 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్, అక్కడి నుంచి ముదిగొండ రోడ్డు మార్గంలో నాయకులు, కార్యకర్తలు బైక్‌లు, కార్లతో ర్యాలీగా మీనాక్షి సెంటర్‌కు చేరుకున్నారు. అప్పటికే చిరుజల్లులు ప్రారంభం కాగా బీఆర్ఎస్ శ్రేణులు వర్షంలో తడుస్తూనే మంత్రి రాక కోసం వేచి ఉన్నారు. మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకోగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ కేటీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. జై బీఆర్ఎస్.. అంటూ నినదించారు. బస్టాండ్ నుంచి మీనాక్షి సెంటర్ వరకు జనసందోహం కనిపించింది.