సూర్యాపేట టౌన్, జూన్ 18: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్‌కు చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే వేదికలు కానున్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదటి నుంచి బీఆర్ఎస్ కోరుతందని ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన కులగణనలో బీసీల జనాభాను తగ్గించి 56శాతంగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కాళేశ్వరం విషయానికి వస్తే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ వివరణను తీసుకున్న ఘోష్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినిట్స్ ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా దాట వేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రివర్గ ఆమోదంతో ప్రణాళికాబద్ధంగా ఇంజినీర్ల సూచనల మేరకే కట్టడం జరిగిందని, కేసీఆర్‌పై బీఆర్ఎస్ పార్టీపై కోపంతో కూలిన ఒక పిల్లర్‌ను సాకుగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి రైతుల పంటలు ఎండ బెట్టిందన్నారు. ఈ కార్ రేస్ నిర్వహణ మంత్రివర్గ ఆమోదంతో జరిగిందని, చెల్లింపులు కూడా సక్రమంగా జరిగాయని కేటీఆర్ స్పష్టత ఇచ్చారన్నారు.
కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై 16 మాసాల్లో 15 కేసులు పెట్టి ప్రజలను, రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.యాసంగి రైతు భరోసాను పూర్తిగా ఇవ్వకుండానే వానకాలం రైతు భరోసాను ఇస్తున్నారని, ఇది ఎన్నికల స్టంట్‌లో భాగమని పేర్కొన్నారు. బీసీలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానిక్లి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ భిక్ష కాదని బీసీల హక్కు అని రాజ్యాంగంలో బీసీల రిజర్వేషన్ పెంచుతూ చట్టం చేయాలన్నారు. కేసీఆర్‌పై మంత్రులపై చేస్తున్న ఆరోపణలు, పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ పాల్గొన్నారు.