చందంపేట(దేవరకొండ), మార్చి 11 :రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేవరకొండలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో చందంపేట మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు సుమారు 500 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రైతులకు రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకున్నారని అన్నారు.
రైతు బంధు డబ్బులు ఎగ్గొడుతూ, దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ పబ్బం గడుపుతున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు క్షమించరని అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన ఉన్నన్ని రోజులు రైతులకు స్వర్ణయుగంగా గడిచిందని అన్నారు. ఇప్పుడు రైతులకు యూరియా, కరెంటు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అభివృద్ధి శూన్యమని, సంక్షేమ పథకాల్లో కోత విధించారని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, వంద రోజులు కాదు కదా.. 800 రోజులు గడిచిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో భారీగా ప్రజా ధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా చందంపేట మండలంలోని కంబాలపల్లి, పాత కంబాలపల్లి, ముర్పునూతల, గన్నెర్లపల్లి, పోలేపల్లి, చందంపేట, పోల్యానాయక్తండా, అచ్చంపేట పట్టి, హంక్యాతండ, నల్లచెలమూల తదితర గ్రామాల నుంచి సుమారు 500మందికి పైగా కార్యకర్తలు, నాయకులు మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు మాజీ ఎంపీటీసీ ముత్యాల చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గాజుల ఆంజనేయులు, బిల్యానాయక్, కిషన్ నాయక్, వడ్త్యా రమేష్‌నాయక్, వెంకట్‌రెడ్డి, వల్లపురెడ్డి, టీవీఎన్‌రెడ్డి, సుభాష్‌గౌడ్, పల్లా ప్రవీణ్‌రెడ్డి, శంకర్ నాయక్, శ్రీనివాస్‌గౌడ్, ముత్యాల రవి, చంద్రశేఖర్, లోక్యానాయక్, పొలగోని సత్యనారాయణగౌడ్, చాట్ల చిరంజీవి, గోపాల్, నాగార్జున్, బొడ్డు గోపాల్, అంజిగౌడ్, రూప్లా నాయక్, చంద్రకళ, భవాని, పొట్ట మధు, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, గోసుల శివ, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.