నేరేడుచర్ల, నవంబర్ 6 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శుద్ధ జలాలు అందించడం కోసం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టింది. మంచి నీటి ట్యాంకుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించింది. ప్రజలకు సరఫరా చేసే నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టేందుకు నీటి పరీక్ష కిట్లు అందజేసింది. దీనికి సంబంధించి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. కానీ పంచాయతీల అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచి నీటి ట్యాంకులోని నీటిని పరీక్షించే కిట్లు అటకెక్కాయి.
బ్లీచింగ్ పౌడర్ చల్లి వదిలేస్తున్నారు..
గ్రామాల్లో ఏఎన్ఎంలు, పంచాయతీ సిబ్బంది కలిసి తరచూ నీటి పరీక్షలు చేసి, సాంద్రతను బట్టి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. విధిగా ఆయా పంచాయతీలు పరీక్ష చేసి తగిన మోతాదులో కలిపిన మిశ్రమాల వివరాలను రికార్డుల్లో పొందుపరిస్తే తదుపరి చర్యలకు దోహదపడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అలా జరుగకపోగా పంచాయతీ కార్యాలయాల్లో ఆ కిట్లు కనిపించడం లేదు. ఆరోగ్య సిబ్బంది కూడా దృష్టి సారించిన దాఖలాలు లేవు. దాంతో పంచాయతీ కార్మికులు తమకు తోచినప్పుడల్లా బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.
వ్యాధులు ప్రబలే ప్రమాదం..
మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయకుండా పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కారణంగా నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెంలో కలుషిత నీరు కారణంగా ఇటీవల చాలామంది అనారోగ్యానికి గురయ్యారు.
దాంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇంతటి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ గ్రామ ప్రత్యేకాధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.