అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించి అందలమెక్కిన తర్వాత అన్నదాతలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడి జిల్లా రైతాంగం సిద్ధమైంది. రైతు మహా ధర్నా పేరుతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండలోని క్లాక్ టవర్ వేదికగా మోగనున్న జంగ్ సైరన్‌కు పెద్దఎత్తున స్వచ్ఛందంగానే రైతులు వచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుతోపాటు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ నెల 21నే ఈ ధర్నా నిర్వహించాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మహా ధర్నా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రైతులు సకాలంలో వచ్చి ధర్నా పూర్తి కాగానే వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు.
హామీల అమలుపై పోరు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12నెలలు అవుతున్నా రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవటంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఇంకా ఇవ్వాల్సిన రుణమాఫీ, రైతు భరోసా, సాగునీరు తదితర వాటిపై బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి అధికార కాంగ్రెస్‌ను ధర్నాలో నిలదీయనున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు..
ధర్నాకు వచ్చే రైతులు హైదరాబాద్ రోడ్డు నుంచి వచ్చే వారు ఎన్జీ కళాశాలలో, సూర్యాపేట రోడ్డు నుంచి వచ్చే వారు కళాభారతి స్థల ఆవరణలో, దేవరకొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే రైతులు చర్చి కాంపౌండ్, లతీఫ్ సాహెబ్ గుట్ట సమీపంలో వాహనాలు పార్కింగ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు.
గత నెల 12న జరుగాల్సి ఉండగా..
ఈ నెల 12న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వేదికగా మహాధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పలు ఇబ్బందులు ఉంటాయని పోలీసులు సూచనతో వాయిదా వేసి ఈ నెల 21న నిర్వహించతలపెట్టింది. అప్పుడు ధర్నాకు ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు నిరాకరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ హైకోర్టును ఆశ్రయించగా 26న నిర్వహించుకోవాలని అనుమతి ఇచ్చింది.
మహా ధర్నాకు పెద్దఎత్తున కదిలి రావాలి
నీలగిరి : నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ రైతు మహాధర్నా ఏర్పాట్లను సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నల్లగొండ, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సభాస్థలం, ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడన్నారు.
అన్ని పథకాలు వాయిదాలు వేస్తూ వాయిదాల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ రైతాంగానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం వెన్ను విరిచిందన్నారు. ధర్నాకు ఉమ్మడి జిల్లా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నాయకులు సింగం రామ్మోహన్, బీఆర్ఎస్ కనగల్ మండలాధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, లొడండి గోవర్ధన్, రావుల శ్రీనివాస రెడ్డి, మెరుగు గోపి, తవిటి కృష్ణ, నారగోని నర్సింహ, డి.రామ్‌రెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, షరీఫ్ తదితరులు ఉన్నారు.
మోసపూరిత కాంగ్రెస్‌ను నిలదీయాలి
కేతేపల్లి : నల్లగొండలో మంగళవారం నిర్వహించే మహా ధర్నాకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. కేతేపల్లి మండల కేంద్రంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా నాలుగు రోజులపాటు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె.ప్రదీప్‌రెడ్డి, నాయకులు బంటు మహేందర్, కె.సైదిరెడ్డి, టి.వెంకన్నగౌడ్, పి.సైదులు పాల్గొన్నారు.
రైతుధర్నాను విజయవంతం చేయాలి
మిర్యాలగూడ/హాలియా, జనవరి 27 : కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండలో మంగళవారం నిర్వహించనున్న రైతు మహాధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మిర్యాలగూడ, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌కుమార్ వేర్వురుగా ప్రజలు, రైతులకు పిలుపునిచ్చారు. హామీల అమలుపై సర్కారును నిలదీయాలని కోరారు.