నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి ప్రచార గడువు ముగిసే మే 11 వరకు రోజువారీ షెడ్యూల్‌కు తుది రూపం ఇచ్చారు. మొత్తం 21 రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలతోపాటు మున్సిపల్ కేంద్రాలను చుట్టి వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు. నిత్యం రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థి ప్రచారం కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షేత్రస్థాయి వరకు బీఆర్ఎస్ ప్రచారం వెళ్లేలా చూస్తున్నారు. మరోవైపు నిత్యం గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ పార్టీ శ్రేణులన్నీ ఎక్కడికక్కడే స్థానికంగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ ప్రచారాన్ని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు పర్యవేక్షించనున్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితోపాటు పార్టీ ముఖ్యులంతా పాల్గొననున్నారు. అక్కడి నుంచి యంత్రం 4 గంటలకు హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలో ప్రచారం కొనసాగనున్నది.
నిత్యం అభ్యర్థి ప్రచారం కొనసాగేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు గుర్రంపోడు, 6 గంటలకు కనగల్, 22న ఉదయం 10 గంటలకు పాలకవీడు, సాయంత్రం 4 గంటలకు అడవిదేవులపల్లి, 6 గంటలకు పెన్‌పహాడ్‌లో అభ్యర్థి ప్రచారం కొనసాగనున్నది. 24న మోతె, అనంతగిరి, మేళ్లచెర్వు, 25న డిండి, పెద్దవూర, తిప్పర్తి, 26న మఠంపల్లి, మునగాల, చివ్వెంల, 27న తిరుమలగిరి(
సాగర్), పీఏపల్లి, చింతపల్లి, 28న నడిగూడెం, చింతలపాలెం, చిలుకూరు. 29న చందంపేట, నేరేడుగొమ్ము, నిడమనూర్, 30న నేరేడుచర్ల మున్సిపాలిటీలో ప్రచారం చేయనున్నారు. మే 2న వేములపల్లి, త్రిపురారం, 3న హాలియా, 4న హుజూర్నగర్, మాడ్గులపల్లి, 5న కోదాడ, 6న దేవరకొండ, కొండమల్లేపల్లి, 8న మిర్యాలగూడ టౌన్, 10న సూర్యాపేట టౌన్, చివరి రోజు నల్లగొండ పట్టణంలో ప్రచారం కొనసాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఈ నెల 23న మంగళవారం రోజున ఉదయం 11గంటలకు నల్లగొండలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ఎన్నికల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు హాజరుకానున్నారు. నామినేషన్ అనంతరం పార్టీ కార్యాలయం నుంచి క్లాక్‌టవర్ వరకు రోడ్‌షో నిర్వహించి అక్కడే పార్టీ శ్రేణులను ఉద్దేశించి నేతలు ప్రసంగిచనున్నారు.