దేవరకొండరూరల్, ఆగస్టు 29 : దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిచిన 13 మంది విద్యార్థులను బీఆర్ఎస్వీ నాయకులు గురువారం పరామర్శించారు. గురుకులంలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ గురుకుల పరిసరాలు పరిశుభ్రంగా లేక పోవడం వల్ల ఎలుకల బెడద తీవ్రంగా ఉందన్నారు. వసతులు, కరెంట్ బోర్డులు, బాత్రూమ్లు, కిటికీలు సరిగ్గా లేవని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించి, అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పి.లక్ష్మణ్, రమేశ్, గుండాల వెంకట్, విక్కీ, హరికృష్ణ, వెంకటేశ్, గోపి, శ్రీను, అనిల్, రవి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా బాధిత విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కేసీఆర్ సర్కారులో సకల సౌకర్యాలతో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు నేడు కాంగ్రెస్ పాలనలో సమస్యల కూపంగా మారాయన్నారు. విద్యార్థులపై ఎలుకలు దాడి గురుకులాల పరిస్థితిని, కాంగ్రెస్ పాలనను తేటతెల్లం చేస్తున్నదని మండిపడ్డారు.