నల్లగొండ, మే 26 : మిర్యాలగూడ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు రూ.124 కోట్లతో నేషనల్ హైవే రోడ్డును పట్టణం గుండా తీసుకెళ్లడానికి ఆనాడు ఢిల్లి సైతం వెళ్లి అధికారులను ఒప్పించి, ఇందులో రూ.54 కోట్లు ఇల్లులు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇప్పించి ఎక్కడా ఇబ్బంది లేకుండా నిర్మాణానికి చర్యలు చేపడితే సక్రమంగా నిర్మించే దమ్ము లేక టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3 కోట్లతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించే డివైడర్లను తమ ఇష్టానుసారంగా కట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు దుయ్యబట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్మిస్తున్న అనవసర, అసౌకర్య డివైడర్ల నిర్మాణాన్ని వెంటనే పునఃపరిశీలించి తొలగించాలని నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
అలాగే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మాజీ కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అధ్వర్యంలో నిర్మించిన 565 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అర్హులైన వారికి గత ప్రభుత్వంలోనే డ్రా పద్దతిలో ఎంపిక చేశారు. కానీ అందులో కేవలం 332 ఇండ్లు మాత్రమే పంచుతామని చెప్పి ఒక అబద్దపు జాబితా విడుదల చేయడం జరిగింది. మిగిలిన ఇండ్లను అధికార పార్టీ వాళ్లకు ఇచ్చుకునే కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. కావున పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి నిజమైన అర్హులైన పేద ప్రజల అందరికి ఇళ్లు కేటాయించాలని కోరారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఇతర అర్హులైన వారికి పెండింగ్లో ఉన్న పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మున్సిపల్ డీఈఈకి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలని, లేనిపక్షంలో భవిష్యత్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండీ.మగ్దూం పాషా, ఎండీ.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండీ.మాజీద్, కౌన్సిలర్లు గడ్డం దీపిక విజయ్, గుడిసె జానకమ్మ దుర్గాప్రసాద్, లవూరి అరుణ సుధాకర్, సందేషి రజిని అంజన్ రాజు, మర్రి అంజిబాబు, తిరుమలగిరి వజ్రం, వడ్డేపల్లి శ్రీను, జన్నపాల సునీత కిరణ్, యర్రమల్ల దినేష్, పద్మశెట్టి లక్ష్మి కోటేశ్వర రావు, తిరంశెట్టి సీతా కోటేశ్వరరావు, గంగుల భిక్షం యాదవ్, ఎండీ.షోయబ్, బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జులు భూక్య రాంబాబు, తిరుపతి రావు, వల్లంపట్ల వినోద్ కుమార్, పందిరి వేణు, గంట శ్రవణరెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, నారబోయిన నాగరాజు, షేక్ మస్తాన్, దైద వెంకటేష్, దైద సత్యం, ఆయిల్ శ్రీను, కోలా రామస్వామి, చిట్టుపోలు వెంకటేశ్వర రావు, పునాటి లక్ష్మి నారాయణ, సుంకోజు మురళి చారి, ఈశ్వర చారి, పామోజు రామాచారి, అలీం, పులిపలుపుల శ్రీనివాస్ గౌడ్, ఎండీ.అలీమోద్దిన్, లాలు నాయక్, రమేష్ చారి, శ్రీను, డీపీఎన్, అఖిల్ నాయక్, నాగార్జున, సైదులు, షేక్ ఫయాజ్, రామావతారం పాల్గొన్నారు.

మిర్యాలగూడ పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా