నకిరేకల్, జూన్ 19 : బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే వాటి లక్ష్యంగా పని చేస్తున్నారని, బీఆర్ఎస్ నిర్మాణంలో ప్రతి ఇన్చార్జి బాధ్యతగా వ్యవహరించి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకూ పోరాడాలని, అర్హుల ఓట్లను కాపాడుకునేందుకు బీఎల్ఏలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మూసీరోడ్డులోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన(సర్), బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఎల్ఏను ఉద్దేశించి మాట్లాడుతూ.. బిహార్‌లో 47 లక్షల ఓట్లు, బెంగాల్లో 90 లక్షల ఓట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 30 లక్షల ఓట్లు తొలిగించారని, తెలంగాణలో ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్ర పన్నుతున్నాయన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఓటు హక్కును కాపాడుకునేందుకు, రాజ్యాంగాన్ని రక్షించే దిశగా బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలను, వారి ఓట్లను రక్షించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి తాను గస్తీ చేస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రేవంత్‌రెడ్డి, ఆయన టీంకు బుద్ధి చెప్పే రోజులు ముందే ఉన్నాయని, వచ్చే పంటకాలంలో వడ్లు కొనే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి జైలు పాలైన దొంగ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతుల రక్తం దోచి నోట్లుగా మార్చి గన్నీ బ్యాగుల్లో డబ్బులు ప్యాక్ చేసి ఢిల్లీ పెద్దలకు పంపిస్తున్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి లాగ తొండల భాష, బండల భాష, బుల్డోజర్ భాష రాదని, మాజీ సీఎం కేసీఆర్ తనకు సంస్కారం నేర్పించారన్నారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని, అమరవీరుల ఆత్మసాక్షిగా చెబుతున్నా బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా లేకపోతే లక్షల ఓ ట్లు గల్లంతవుతాయని, తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు సర్‌తో ఒప్పందం చేసుకున్నాయని, ఓటు హక్కును రక్షించేందుకు బీఆర్ఎస్కు సంబంధించిన బీఎల్ఏలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతును రాజు చేసేలా కేసీఆర్ పాలన కొనసాగిందని, రైతులు 37 రకాల సన్నాలు పండిస్తుంటే 7 రకాల సన్నాలే పండించాలని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడని, నేడు హామీ ల అమలును తుంగలో తొక్కాడన్నారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ప్రకటించి వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆపద కాలంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను బీఆర్ఎస్ ఆదుకుంటుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గులాబీ సైన్యం నెల రోజుల పాటు జూన్ 25 నుంచి సర్ ప్రారంభమవుతోందని, బీఆర్ఎస్ బీఎల్ఏలంతా ఏమరపాటుగా ఉండొద్దని, ఫాం-6, 7, 8 గురించి తెలుసుకోవాలని సూచించారు.
నోటీసు ఇవ్వకుండా ఓటు తీసేసే ప్రమాదముందని, బీఎల్ఏ ప్రతి ఓటును సునిశితంగా పరిశీలించాలన్నారు. ఓటు హక్కును గుంజుకునే హక్కు ఎవరికీ లేదని, రాజ్యంగబద్ధంగా బీజేపీ,కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టి ఓట్లను కాపాడుకోవాలని, అందుకు బీఆర్ఎస్ బీఎల్ఏలు కంకణబద్ధులై పనిచేయాల్సిన అవసరముందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎంగా చేసుకోవాలని, అందుకు ప్రతిఒక్క కార్యకర్త, నాయకుడు పార్టీ బలోపేతం కోసం కృషిచేయాలన్నారు. సమావేశంలో యుగంధర్‌రావు, చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజు మాట్లా డారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య, నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజు, నలగాటి ప్రసన్నరాజ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి గోలి శివ ప్రసన్నకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు తరాల బలరాం, మాద ధనలక్ష్మీనగేశ్, మాజీ ఎంపీపీ నరేందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్ పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు లోపాయికారి ఒప్పందాలతో ఓట్లు తొలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఓటును తొలిగించే విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తహసీల్దార్ గానీ, ఆర్డీవోకు గానీ, కలెక్టర్ దృష్టికి గానీ తీసుకురావాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్ర పన్నుతున్నాయి. రేవంత్‌రెడ్డి, మోదీ ఒక్కటే అని, కేంద్రం ఎంత కొంటే అంతే ధాన్యం తాము కొంటామని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడన్నారు. కేసీఆర్ అప్పులు చేసిండు అని రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నాడని, మరీ ఆయన రెండేండ్లలోనే 4 నుంచి 5 లక్షల కోట్ల అప్పులు చేశాడని, దేనికి ఖర్చు చేశాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని అందరికీ తెలుసునని, కాంగ్రెస్‌ను ముంచి రేవంత్‌రెడ్డి బీజేపీలోకి పోయే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. మళ్లీ బీజేపీ నుంచి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన చేస్తున్నాడని, ఇంకా ప్రజల సంక్షేమం గురించి ఏం పట్టించుకుంటాడని, కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని బీఎల్ఏలకు పిలుపునిచ్చారు.
రైతుల ధాన్యం కొనే పరిస్థితి లేదు. కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుబంధూ లేదు. రుణమాఫీ అసలే లేదు. యూరియా సరిపడా లేదు. అసలు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించామా అని ప్రజలు నెత్త్తీనోరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో, నాయకుల్లో జోష్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు గెలుస్తుంది. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి చిరుమర్తి లింగయ్య ఎంతో కృషి చేశాడు. ఆయన్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరముంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు తొలిగించే కుట్ర జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు క్రమశిక్షణతో ఓటరు లిస్టును పరిశీలించి ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
నకిరేకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులకు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని, కాంగ్రెస్‌లో చేరాలని ప్రభుత్వ ఉద్యోగులతో రాయబారం పంపుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై, సోషల్ మీడియా ఇన్చార్జిలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తెచ్చిన నిధులకు సంబంధించిన శిలాఫలకాలు తొలిగించి కొత్త శిలాఫలకాలు పెడుతున్నారే తప్ప ఏ గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. రామన్నపేట మండలంలో ఏ గ్రామంలో చూసినా ఇంకా కళ్లాల్లో ధాన్యం ఉందని, నాలుగు నెలలైనా ధాన్యం కొనుగోలు చేయలేదని, ఇంత అసమర్థమైనది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. నియోజకవర్గంలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలని, అమలుకానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి దొంగపాలన, రాక్షసపాలన అని చిరుమర్తి పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఉన్న నకిరేకల్ నియోజకవర్గాన్ని కబ్జాకోరు రాజకీయాలకు, హత్యారాజకీయాలకు అడ్డాగా మార్చారన్నారు. ఓటుకు నోటుకు కేసు దొంగ రేవంత్‌రెడ్డి కొంతమంది విప్‌లను పెట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, వాళ్ల స్థాయి ఏందో మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. ప్రైవేటు సైన్యాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ అధికారం వచ్చాక అందరికీ సమాధానం చెపుతామని కాస్త ఓపిక పట్టాలని హితువు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎంపీటీసీ, సింగిల్ విండో ఎన్నికలు పెడితే ఓటమి భయంతో సింగిల్ విండో నామినేటెడ్ పదువులు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. మొరిగె ప్రతి కుక్కకు సమాధానం చెప్పబోమని, అధికారం వచ్చాక ప్రతి కుక్కకు కచ్చితంగా ఘాటుగా బుద్ధి చెబుతామని చిరుమర్తి హెచ్చరించారు.