జిల్లాలో విచ్చలవిడిగా నకిలీ పత్తి విత్తనాలు దొరుకుతున్నాయి. మోసాలకు అలవాటుపడ్డ దగాకోరులు రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు. అధికారుల కండ్లుగప్పి నకిలీ విత్తనాలను ఆంధ్రా ప్రాంతం నుంచి గుట్టుచప్పుడు కాకుండా తెస్తున్నారు. దళారులు అమాయక రైతులను నమ్మించి మోసం చేస్తున్నారు. తక్కువ ధరలకు వస్తున్నాయి… దిగుబడి బాగా వస్తుందని రైతులకు అంటగడుతున్నారు.
సూర్యాపేట, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వారం రోజుల్లోనే దాదాపు 70లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల పత్తి విత్తనాలు సీజ్ చేశారంటే నకిలీ విత్తనాల దందా ఏ రీతిన జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ స్థాయిలో నకిలీ విత్తనాల దందా లేదు. కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ నకిలీ విత్తనాలను అరికట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నకిలీ విత్తనాలు ఎంతో ప్రమాదకరమో.. రైతులను చైతన్యం చేసింది. ఒక్క నకిలీ గింజ కూడా రాకుండా కట్టడి చేసింది. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలతో తెలంగాణ రైతాంగం రికార్డు స్థాయి పంట పండించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ పాలనలో .విచ్చలవిడిగా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు.
కొంతమంది ఆంధ్రా వ్యాపారులు.. స్థానికంగా దళారులను ఏర్పాటు చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రా నుంచి నకిలీ విత్తనాలను తీసుకువస్తున్నారు. పంట బాగా వస్తుందని, తక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా లభిస్తుండడం పట్ల అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిమంది రైతులు కక్కుర్తో, అత్యాశో.. అమాయకత్వమో.. తెలియదు కాని మోసపోతూనే ఉన్నారు. ఇటీవల పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తిరుమలగిరి మండలంలో రూ.4,62,000 విలువ చేసే 308 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మోతె, ఆత్మకూర్.ఎస్ మండలాల పరిధిలో 65 లక్షల విలువైన 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ లెక్కన వారం వ్యవధిలోనే దాదాపు 70 లక్షల విలువ చేసే 25 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల లభ్యం కావడం పట్ల నకిలీ దందా ఏ రీతిన జరుగుతుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారి మాయ మాటలకు రైతులు మోసపోవద్దు. లైసెన్స్ లేని వారి వద్ద కొనుగోలు చేసి నష్టపోతే కంపెనీ నుంచి కానీ, డీలర్ నుంచి అయినా పరిహారం పొందే అవకాశం ఉండదు. ప్రభుత్వం సూచించే బ్రాండ్లను కొనుగోలు చేసి నష్టపోతే పరిహారం ఇప్పించేందుకు తాము పూర్తిగా సహకరిస్తాం. ఎవరైనా బ్రాండ్ లేకుండా ప్రభుత్వం సూచించిన కంపెనీలు కాకుండా ఇతరత్రా విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. బయటి నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలని ఎవరైనా వస్తే తమను సంప్రదించి మంచివా కాదా అనేది నిర్ధారించుకోవాలి.