సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు హెడ్మాస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. సంక్రాంతి సెలవుల అనంతరం ఇవాళ పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో నల్గొండ నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు కారులో తుంగతుర్తిలోని స్కూల్‌కు బయల్దేరారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరు వెళ్తున్న కారు అరవపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కస్తర్బా పాఠశాలలు ఎస్‌వోగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే దుర్మరణం చెందింది. రావులపల్లి హెడ్మాస్టర్గా పనిచేస్తున్న పోరెడ్డి గీతారెడ్డి, తుంగతుర్తి హెడ్మాస్టర్ అల్వాల ప్రవీణ్, అన్నారం హెడ్మాస్టర్ అల్వాల సునీత తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గీతారెడ్డి కూడా మరణించారు.