రామగిరి/భువనగిరి అర్బన్, ఏప్రిల్ 1 : ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గతేడాది అక్టోబర్ నుంచి ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు దశలవారీగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అప్పులు చేసి కళాశాలలు నిర్వహించలేమని, డిగ్రీ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు బహిష్కరిస్తామని కళాశాలల యాజమాన్యాలు ఇటీవల ఎంజీయూ వీసీకి, అధికారులకు వినతి పత్రాలు కూడా అందించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో నేటి నుంచి ఎంజీయూతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాల వద్ద పరీక్షలు బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీడీపీఎంఏ ఎంజీయూ చాప్టర్ అధ్యక్షుడు, నల్లగొండలోని నీలగిరి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ మారం నాగేందర్‌రెడ్డి, కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, ఎంజీయూ ఫైనాన్స్ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోవడంతో విధిలేని పక్షంలో నిర్ణయం చేశామన్నారు.
ఇప్పటికే లక్షల రూపాయాలు అప్పులు చేసి అధ్యాపకుల వేతనాలు, భవనాల అద్దెలు, మున్సిపల్ ట్యాక్స్, యూనివర్సిటీ ఫీజులు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల వద్ద ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని చదువులు చెబుతూ వచ్చామని తెలిపారు.
మరో వైపు అధ్యాపకులు సైతం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో తమ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, లేని పక్షంలో తరగతుల నిర్వహణ, పరీక్షల విధులకు హాజరుకాబోమని భీష్మించి కూర్చున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి కళాశాలల యాజమాన్యాలను, అధ్యాపకులను ఆదుకోవాలని కోరారు. నేటి నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనుండగా పరీక్షలు జరుగుతాయో లేదోనని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.