చండూరు, మార్చి 28: ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ (BJP) నేత ముదిగొండ ఆంజనేయులు డిమాండ్ చేశారు. అధికారం కోసం చేయూత పథకం ద్వారా ప్రతినెల రూ.4 వేలు, మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి గృహిణికి నెలకు రూ.2500 అందిస్తామన్న హామీలను నిలబెట్టుకోవాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడలో బీజేపీ తరఫున ఆయా పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పిందని, గద్దనెక్కిన తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అనేకసమస్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన బీజేపీ ఎప్పుడూ పోరాడుతుందన్నారు. గ్రామాలలో ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ కాలేదని, రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కాలేదని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు బంద్ చేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కో కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, జెట్టి యాదయ్య, నాంపల్లి శేఖర్, పులిజాల రవీందర్, తుల్లా వెంకన్న, కడారి నర్సింహా, అబ్బానగోని యలాద్రి తదితరులు పాల్గొన్నారు.