– రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రమేష్
నల్లగొండ, ఫిబ్రవరి 03 : నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు అలాగే 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ రమేశ్ మంగళవారం వెల్లడించారు. నిందితులను చండూరు మండల కేంద్రానికి చెందిన పగిళ్ల శివకుమార్(19), రంగారెడ్డి జిల్లా జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన అలుగలు వంశీకృష్ణ(23)గా గుర్తించారు. మరో ఇద్దరు మైనర్లు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడించారు.
30 డిసెంబర్,2025న ఏపీలోని కడప జిల్లాకు చెందిన పల్లెం నరసయ్య తన యమహా బైక్‌పై హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నాడు. మార్గమధ్యలో కేతేపల్లి గ్రామంలోని సాయికృష్ణ హోటల్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో నిద్ర రావడంతో హోటల్ ఆవరణలో బైక్ పార్క్ చేసి నిద్రించాడు. తెల్లవారుజామున లేచి చూసేసరికి బైక్ కనిపించకుండా పోయింది. దీంతో కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో కేతేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వ్యక్తులు విజయవాడ వైపు వెళ్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ల దొంగతనాల విషయం వెలుగు చూసింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కేసును నల్లగొండ డీఎస్పీ పర్యవేక్షణలో విజయవంతంగా చేందించిన శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, సీసీఎస్ సీఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, కేతేపల్లి ఎస్ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి, వాహీద్, పుష్ప గిరి ఇతర సిబ్బందిని అదనపు ఎస్పీ రమేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

Bike Thiefts : బైక్‌ల దొంగల ముఠా అరెస్ట్