నల్లగొండ ప్రతినిధి, మే 14 (నమస్తే తెలంగాణ) : 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండలో స్వల్పంగా పోలింగ్ తగ్గగా భువనగిరిలో పెరిగింది. నల్లగొండలో తుది పోలింగ్ 74.02శాతం కాగా భువనగిరిలో 76.78శాతంగా నమోదైంది. సోమవారం జరిగిన పోలింగ్‌లో కొన్నిచోట్ల రాత్రి 8గంటల వరకు ఓటింగ్ కొనసాగడంతో తుది లెక్కలు తేలే సరికి అర్ధరాత్రి దాటింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు తిరిగి రిసెప్షన్ కేంద్రాలకు వచ్చాక ఫైనల్ పోలింగ్ ఎంతో వెల్లడైంది. దీంతో మంగళవారం ఉదయం అధికారులు తుది పోలింగ్ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోనే భువనగిరి లోక్‌సభ స్థానంలో అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇక్కడ పోలైన ఓట్లు 76.78 శాతం కాగా, ఇది 2019 కంటే ఎక్కువ. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో 74.02శాతం నమోదు కాగా, గతం కంటే స్వల్పంగా తగ్గింది. పోలింగ్ లెక్కలు ఇలా ఉంటే.. ఆయా పార్టీల అభ్యర్థులు మాత్రం ఓటర్ల మనోగతంపై మళ్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలు, గ్రామాలు, మండలాల వారీగా తమ పోల్ మేనేజ్మెంట్లో కీలకంగా పనిచేసిన నేతలు, అనుచరులతో చర్చోపర్చల్లో మునిగి తేలుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర సగటుతో పోలిస్తే ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదైనట్లే. 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే భువనగిరి అత్యధిక పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలువగా, నల్లగొండ ఐదో స్థానంలో ఉంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో తుది పోలింగ్ ప్రకారం 76.78శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019తో పోలిస్తే 2.39శాతం అదనం.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 74.39శాతం నమోదైంది. ఇక నల్లగొండలో ప్రస్తుతం 74.02శాతం పోలింగ్ కాగా, 2019లో ఇది 74.11శాతం నమోదైది. అంటే ఈ సారి ఇక్కడ 0.09శాతం తగ్గింది. అయితే భువనగిరి లోక్‌సభ పరిధిలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి గణనీయమైన ఓటింగ్ జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 91.89శాతంతో రాష్ట్రంలోనే మునుగోడు అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి కూడా తన చైతన్యాన్ని చాటుకుంది. ప్రస్తుత ఎన్నికలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలో నర్సాపూర్ తర్వాత 83.71శాతంతో మునుగోడు రెండో స్థానంలో నిలిచింది. ఆలేరులో సైతం 82.81, భువనగిరిలో 82.71శాతంతో భారీగా ఓటింగ్ జరిగింది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రం అతి తక్కువగా 66.83శాతం పోలింగ్ జరిగింది. ఇక నల్లగొండ లోక్‌సభ పరిధిలో హుజూర్నగర్ నియోజకవర్గం 76.34శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 70.60 శాతంతో దేవరకొండ లాస్ట్‌లో నిలిచింది. అయితే.. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ప్రస్తుతం అన్నిచోట్లా ఓటింగ్ శాతం తగ్గిందనే చెప్పవచ్చు.
వచ్చే నెల 4న జరుగనున్న కౌటింగ్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. నల్లగొండ లోక్‌సభ స్థానం ఈవీఎంలను అనిశెట్టి దుప్పలపల్లిలోని స్టేట్‌వేర్ హౌసింగ్ గోదాములకు తరలించి అక్కడ స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. భువనగిరి స్థానానికి సంబందించిన ఈవీఎంలను అక్కడి అరోరా ఇంజినీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్స్‌కు మంగళవారం అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశారు. వాటి వద్ద మూడంచెల భద్రతతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీ టీవీల పర్యవేక్షణ కొనసాగుతుంది.