భువనగిరి కలెక్టరేట్, జూన్ 19 : ప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు రసాభాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే పట్టణ పరిధిలోని రాయగిరిలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 518 సర్వేనెంబరులోని వందలాది ఎకరాల భూమి పూర్తిగా భూదాన్ భూమిగా నమోదైందని వారు పేర్కొన్నారు.
భూదాన్ భూమిగా నమోదు కావడంతో గ్రామస్తులుకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏవీ వర్తించడంలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కండ్ల ముందు ఉన్న భూమి తమకు కాకుండా పోయిందంటూ వారు ఆందోళన చేశారు. వెంటనే రికార్డుల నుంచి 518 సర్వేనంబరుకు మినహాయింపు కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. స్పందించిన తహసీల్దార్ అంజిరెడ్డి మాట్లాడుతూ 518లో ఉన్న భూమి భూదాన్ భూమి అని, తమ పరిధిలో లేదని తెలియజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పరిష్కారం చూపాలి
రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు భూసమస్యను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహా డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం రాయగిరిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేసి రెవెన్యూ సదస్సుల్లో వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని రైతులకు మరోమారు అవకాశం కల్పించాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో వివిధ గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.