పెన్‌పహాడ్, ఏప్రిల్ 22 : భూ భారతి చట్టం -2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టంలో తాసీల్దార్ స్థాయి నుండి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడిందని, భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు.
గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి ప్రతి రైతుకి 1బి అందజేస్తామని, ఏమైనా తప్పులుంటే సరి చేస్తామని తెలిపారు. విస్తీర్ణంలో మార్పులు, మిస్సింగ్ సర్వే నంబర్, సవరణలు లాంటి ప్రతి సమస్యకి మీ సేవ ద్వారా కాకుండా స్వయంగా దరఖాస్తు చేసుకునేలా భూ భారతి పోర్టల్ రూపొందించబడినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ వేణు మాధవ్ రావు, తాసీల్దార్ ధరావత్ లాలూనాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లరావు, ఏఓ అనిల్‌కుమార్, ఏపీఎం అజయ్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగరావు పాల్గొన్నారు.