చండూరు, మే 16 : ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చండూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం జడ్పీహెచ్ఎస్ లో ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించగా, గది ముందు భాగంలో ఉన్న వరండాకు సైతం గ్రిల్స్ పెట్టించి గదిలా మార్చాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు మౌలిక సదుపాయాలైన ర్యాంప్, టాయిలెట్స్, రైలింగ్, తాగునీరు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని, అంతేకాక వారికి తగ్గట్టుగా కృత్యాధార పద్ధతిలో బోధన ఉండేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, కావునా ప్రతిరోజు రెండు, మూడు లారీలను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, తాసీల్దార్ దశరథ, ఎంఈఓ ఉట్కూరు సుధాకర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు ఉన్నారు.