సూర్యాపేట, అక్టోబర్ 26 : ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానకు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిజం చేసేలా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించి రోజు, నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నది తెలుసుకున్నారు. ఇక్కడి వచ్చే గర్భిణుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రసూతి కోసం గర్భిణులను తీసుకొచ్చిన ఆశ కార్యకర్తలతో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎమర్జెన్సీ చైల్డ్ కేర్ సెంటర్‌ను పరిశీలించి తక్కువ బరువు, నెలలు నిండక ముందు పుడుతున్న పుడుతున్న పిల్లలకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. ఓపీ, ఐపీ, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. టీ హబ్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను, సెంట్రల్ డ్రగ్ సెంటర్, ఫార్మసీ స్టోర్లను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. రోగులకు అవసరమైన మందులు లేవని చెప్పద్దని, ముందుగానే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో రెసిడెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.