దేవరకొండ రూరల్, నవంబర్ 28 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత తమందరిపై ఉందని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ ఆర్టీసీ సిబ్బందితో అన్నారు. శుక్రవారం దేవరకొండ, కొండమల్లేపల్లి బస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు సమిష్టి కృషితో డిపోను ముందంజలో ఉంచాలన్నారు. బస్ స్టేషన్లను, డిపోను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల సంక్షేమం కోసం ఆర్టీసీ సంస్థ కృషి చేస్తుందన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేస్తూ డిపోను రాష్ట్రస్థాయిలో ముందుంజలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం కె.జాన్ రెడ్డి, దేవరకొండ డిపో ఇన్చార్జి మేనేజర్ పడాల సైదులు, ఉద్యోగులు పాల్గొన్నారు.