కొండమల్లేపల్లి, అక్టోబర్ 08 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఔట్ పేషెంట్ రికార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అంటు వ్యాధులు, వైరల్ జ్వరాలు ఎక్కువగా వస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. పీహెచ్సీలలో 100 శాతం ప్రసూతి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోయినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కేస రవి, మండల వైద్యాధికారి ఉషారాణి, లక్ష్మణ్ ఉన్నారు.