పెన్పహాడ్, అక్టోబర్ 07 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిల్వలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. హై రిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించి క్లస్టర్ ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలన్నారు.
ఆశ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేష్, హౌస్ సర్జన్ డాక్టర్ పూనమ్ చంద్, తడూరి వెంకన్న, పుల్లమ్మ, సుజాత, స్వర్ణలత, అనిల్, రాజు, వెంకటరమణ, దివ్య, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.