రామగిరి, సెప్టెంబర్ 5 : ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని, అందుకే గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్లగొండలోని జీఎం ఫంక్షన్ హాల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథుగా మంత్రి కోమటిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు, కవి, రచయిత కోడూరి విశ్వవిజయేంద్రప్రసాద్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని, కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందని చెప్పారు.
ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల మాదిరిగా విద్యార్థులను చదివిస్తే ఆణిముత్యాల లాంటి ఉత్తమ పౌరులను తయారు చేయవచ్చని అన్నారు. రాజ్యసభ సభ్యుడు కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై విశ్వాసం పెంచేలా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ‘నేను నుంచి మన’ అనే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో కల్పించాలని తెలిపారు.
ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్‌లో సీటు దొరుకడం లేదని, అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నల్లగొండ ఎంపీ కుందూరి రఘవీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
నకిరేకల్, మిర్యాలగూడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీఎల్ఆర్, మందుల సామేల్ మాట్లాడుతూ ప్రపంచాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకు ఉందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ తాను ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు.
మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు అభ్యసన సామర్థ్యాలు, బోధన సామగ్రితో బోధన అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 155 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు. వేడుకలో బాలు మాస్టార్ శిష్య బృందం చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు టి.పూర్ణచంద్ర, జె.శ్రీనివాస్, డీఈఓ బి.భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ఆర్డీఓ రవి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచయంద్రయ్య, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులంటే వీరేనా !
జిల్లా కేంద్రంలోని జీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ మాట్లాడుతున్న సందర్భంలో సభలో ఉన్న ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా ముచ్చట్లులో మునిగిపోయారు. దీంతో డీఈఓ భిక్షపతి వేదికపై నుంచి కల్పించుకుని ఉపాధ్యాయులంతా నిశ్శబ్ధం పాటించాలని పలు పర్యాయాలు విజ్ఞప్తి చేశారు. అప్పటికీ టీచర్లు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారు. మరోవైపు వేదికపై సన్మాన సమయంలో ఉపాధ్యాయులు గుంపులుగా రావడతో కింద కూర్చున్న వారికి ఏం జరుగుతుందో తెలువని పరిస్థితి చోటుచేసుకుంది. ఉపాధ్యాయుల కార్యక్రమం ఇలానా అని పలువురు విమర్శలు చేయడం కనిపించింది.
అవార్డుల ఎంపికలో అవకతవకలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు వచ్చిన దరఖాస్తుల్లో బుధవారం రాత్రి వరకు కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆమోదంతో 130 మంది జాబితాను డీఈఓ భిక్షపతి విడుదల చేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల నేతల పైరవీతో తొలి జాబితా కాకుండా మరో 25మందిని అనధికారికంగా ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. ఇది పూర్తిగా జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిదమేనని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన కలెక్టర్ నారాయణరెడ్డికి పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు దీనిపై ఫిర్యాదు చేశారు.