చివ్వెంల, మే 22 : ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ద్వారా రైతులకు సులభంగా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతాయని చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం, తిరుమలగిరి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ విధానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్టులో భాగంగా ప్రతి రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడీ కేటాయించి వారికి ఉన్న భూమి రకము, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడమే ఫార్మర్ రిజిస్ట్రీ అని తెలిపారు.
ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు అన్నారు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుందన్నారు. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకము, సర్వే నంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐడీ ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్ తో తెలుసుకోవచ్చన్నారు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయి హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శైలజ, మానస, రైతులు పాల్గొన్నారు.