యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గ్యాస్ సబ్సిడీకి కాంగ్రెస్ సర్కార్ రాంరాం చెప్పినట్లే. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొం డిచెయ్యి చూపిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మోసగిస్తోంది. దీంతో లబ్ధిదారులు గ్యాస్ బండ కోసం మొత్తం డబ్బు చెల్లించాల్సి పరిస్థితి నెలకొన్నది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా రాయితీకి లింక్ చేసుకునే సదుపాయం కల్పించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అరకొర సబ్సిడీ కూడా నామ మాత్రంగానే అమలవుతోంది.
అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపించింది. ఇందులో మహాలక్ష్మి పథకం ప్రధానమైంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకు రూ. 2500, గ్యాస్ సబ్సిడీ ఈ పథకంలో భాగమే. ఇందులో నెలకు రూ. 2500 ఆర్థిక సాయం ముచ్చట ఇప్పటి వరకు పత్తాలేదు. ఆర్టీసీతో పాటు గ్యాస్ రాయితీ పథకాన్ని మాత్రం ప్రారంభించింది. రూ. 500కే సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే వినియోగదారులు ముందుగా పూర్తిగా డబ్బు చెల్లించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.
సబ్సిడీ డబ్బు జమ ఏదీ..
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా గ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలో ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఎల్పీజీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 915 ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 375 రాయితీగా ఇస్తుంది. స్కీం ప్రారంభమైన మొదట్లో సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో సరిగ్గానే జమ అయ్యాయి. కానీ పార్లమెంటు ఎన్నికల తర్వాత డబ్బులు జమ కావడంలేదంటూ లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు సరైన ధ్రువ పత్రాలు అందజేసినా డబ్బులు జమ కావడంలేదు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.30లక్షల గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్పటం గమనార్హం.
కొత్త వారికి రాయితీ ఎప్పుడో..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో 2023 డిసెంబర్ 28న ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రజాపాలన వెబ్‌సైట్‌ను నిలిపేశారు. అయితే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని సర్కార్ గతంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మళ్లీ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. రెండేళ్లు కావొస్తున్నా ప్రజాపాలన ఊసేలేదు. ఇటీవల కొత్తగా వేలాది మంది రేషన్ కార్డులు తీసుకున్నారు. వీరంతా గ్యాస్ సబ్సిడీకి లింక్ చేసుకోలేదు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే లింక్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో వేలాది మందికి సబ్సిడీ అందని ద్రాక్షగానే మిగులుతున్నది.
సబ్సిడీ డబ్బులు కొన్ని రోజులే వచ్చినయి..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాకు కొన్ని నెలలు గ్యాస్ డబ్బులు జమ అయ్యాయి. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో జమ కావడంలేదు. ఆటో చార్జీలతో కలిపి గ్యాస్ సిలిండర్‌కు రూ. 950 వరకు ఖర్చు అవుతున్నది. కొన్ని రోజులు ఇచ్చి.. మళ్లీ నిలిపేయడం ఏంటి..? కొందరికే ఇచ్చి.. మరికొందరికి బంద్ చేయడం సరి కాదు. గ్యాస్ సబ్సిడీ అందరికీ వర్తింపజేయాలి.
నీళ్ల వినోద, గృహిణి, అస్సోనిగూడెం, చౌటుప్పల్ మండలం
గ్యాస్ డబ్బులు పడతలేవు..
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక కొన్ని నెలలు డబ్బులు పడ్డాయి. చాలా రోజుల నుంచి డబ్బులు పడతలేవు. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ మంచిగ వచ్చినాయి. ఇప్పు డు అన్ని ధరలు పెరిగినయ్. ఎవర్ని అడగాలో ఏమో అర్థమైతలేదు.
దేవరకొండ అండాలు, భీమనపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం