నల్లగొండ, నవంబర్ 18: చర్లపల్లికి చెందిన కుందూరు లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మినట్లు సెంటర్ నిర్వాహకులు ఆయనకు ఆధార్ కార్డులో రాసి ఇవ్వటంతో పాటు వారి వద్ద ఉన్న రికార్డులో నమోదు చేసుకున్నారు. మూడు రోజుల తర్వా త మిల్లు నుంచి వచ్చే తక్ పట్టీలో 137 బస్తాలు మాత్రమే ఉందని రాసి ఇచ్చా రు. అంటే క్వింటాల్‌కు రెండు కేజీలకు పైగా తరుగు తీశారన్న మాట. ఇక నార్క ట్పల్లి మండలం నెమ్మాని గ్రామానికి చెందిన కుకుడాల భాస్కర్‌రెడ్డి అదే గ్రామంలోని ఐకేపీ సెంటర్లో ధాన్యం కాంటా వేస్తే 233 బ్యాగులుగా తేలింది. మరునాడు అదే సెంటర్ నిర్వాహకులు భాస్కర్ రెడ్డికి కాల్ చేసి మిల్లు వారు నీ ధాన్యం వద్దని అంటున్నారు..అందులో తాలు ఉందట వెంటనే వెళ్లి మా ట్లాడుకోవాలని సమాధానం. ఇది జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులు-మిల్లర్లు కలిసి ఆడుతున్న దోపిడీ డ్రామా. ఒకరితోఒకరు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారు. ముందుగానే బస్తా బరువు అని…పాక్షిక నష్టం కింద అని కేంద్రాల్లో రెండు కేజీల వరకు తరుగు తీస్తుండగా మిల్లుల్లో తాలు అం టూ.ధాన్యం పచ్చిగా ఉందంటూ మరో రెండు కేజీలకు పైగా అంటే క్వింటాల్‌కు ప్రతి రైతు నుంచి ఐదు కేజీలకు పైగా దోపిడీ చేస్తున్నారనేది సుస్పష్టం.
జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యంలో మొత్తం 6.30 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాల్సి ఉండగా అందులో 4.65 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు, 65 వేలు సన్నాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయా కేంద్రాల్లో 1.60 లక్షలు దొడ్డు, 2800 మెట్రిక్ టన్నులు సన్నాలే కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఉన్న మిల్లర్లు మాత్రం 3.30లక్షల ధాన్యం కొనుగోలు చేయటం విశేషం. ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతున్న దోపిడీతో పాటు ప్రభుత్వం గత సీజన్లోనే సన్నాలకు బోనస్ ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు మిల్లుల వైపు దృష్టి సారిస్తున్నారు.
రైతు పండించిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలకు తీసుకొచ్చి పక్షం రోజుల వరకు దానిని ఆరబెట్టి అమ్ముతున్న క్రమంలో పాక్షిక నష్టం, బస్తాల తూకం పేరుతో కేంద్రాల్లో మోసం చేస్తున్నారు. నిర్వాహకులు, మిల్లర్లు ఒక్కటై తేమ, తాలు పేరుతో మరో కొత్త మోసానికి తెరలేపి రైతులను దగా చేస్తున్నారు. కేం ద్రాల్లో రోజుల తరబడి ఉండలేక కొందరు… యాసంగి సీజన్‌కు సిద్ధమయ్యేందుకు మరికొందరి రైతుల ఆరాటాన్ని సొమ్ము చేసుకొని క్వింటాల్‌కు ఐదు కేజీల వరకు అంటే ఎకరం ధాన్యం సాగు చేసిన రైతుకు క్వింటా ధాన్యంపైగా రూ.3000 వరకు గుంజుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’లో వార్తా కథనం వెలువడినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్నదాతలను నట్టేట ముంచుతున్నారు.
నేను వారం కింద చర్లపల్లి హాకా సెంటర్లో ధాన్యం విక్రయిస్తే మొత్తం 140 బస్తాలు అని ఆధార్ కార్డు లో రాసివ్వటంతోపాటు వారి రికార్డులో కూడా రాసుకున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు మిల్లులో ధాన్యం నింపుకున్నాక తక్ పట్టీలో 137 బస్తాలే అని ఉంది. దీంతో నేను వెళ్లి హాకా సెంటర్ వారిని అడిగి తే తేమ వల్ల తరుగు తీశామని అన్నారు. తేమ ఉం టేనే మీరు కాంటా వేశారు కాదా అని నిలదీస్తే మాకు తెల్వదు.. పై వాళ్లను అడగండి అని అంటున్నారు.
నేను మూడు రోజుల కింద మా గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో వడ్లు అమ్మితే 233 బ్యాగులు అయిందని కాం టా వేసిన తర్వాత రాసిఇచ్చారు. తెల్లారి ఐకేపీ సెంటర్ నిర్వాహకురాలు నూర్జహాన్ కాల్ చేసి అక్కెనపల్లి మిల్లులో మీ ధాన్యం దింపుకోవటం లేదు..వెళ్లి మాట్లాడుకుంటే ఎంతో కొంత తరుగు తీస్తారని లేదంటే వారు దింపుకోరని వత్తిడి చేసింది. 13 శాతం తేమ ఉందని వ్యవసాయ శాఖ అధికారి చెప్పిన తర్వాతనే కాంటా పెట్టి ఇప్పుడు తేమ లేదంటే ఏం చేయాలో తెలుస్తలేదు.