హాలియా/నందికొండ, ఆగస్టు 15 : సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్ అన్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. అనంతరం నందికొండ హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానను వెళ్లారు. ఆస్పత్రిలో రికార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందులు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రవీందర్‌నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, డెంగ్యూ లాంటి కేసులు నమోదైతే తగిన విధంగా వైద్యం అందించాలని సూచించారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వేణుగోపాల్‌రెడ్డి, గీతావాణి, రవి, జిల్లా టీబీ అధికారి కళ్యాణ చక్రవర్తి, సీఎంఓ భానుప్రసాద్, హాలియా వైద్యాధికారి రామకృష్ణ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు కృష్ణ కుమారి, అరుంధతి, శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది బొడ్డుపల్లి సైదులు, దయాకర్, జావిద్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
చందంపేట(నేరెడుగొమ్ము), ఆగస్టు 15 : సుమారు రెండేండ్ల తర్వాత నాగార్జున సాగర్ కొత్త అందాలు అద్దుకుంది. దాంతో ప్రాజెక్టు వెనుక జలాలు పెరిగాయి. నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ సమీపంలో నిండుగా కనిపిస్తున్న జలాలతో ప్రకృతి అందాలు పర్యాటకులకు కట్టిపడేస్తున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉండడంతో మత్స్యకారులు జోరుగా చేపల వేట సాగిస్తున్నారు. సాగర్ నీళ్లు పెరుగడంతో నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ, బుగ్గతండా, సుద్దబాయితండా, చిన్నమునిగల్, పెద్దమునిగల్, తూర్పుతండా, మోసంగడ్డతండా, చందంపేట మండలంలోని గువ్వలగుట్ట, మంగళితండా, నక్క దుబ్బతండా ప్రజలు, మత్స్యకారులకు ఉపాధి దొరికినట్లయ్యిం ది. ఇక సాగర్ వెనుక జలాలను ఆనుకొని పంటలు సాగు చేసే రైతులకు కూడా నీటికి ఢోకా లేదు.