నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి3(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించిన కులగణనకు సంబంధించిన ఇంటింటి సర్వే గణంకాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, సామాజిక వేత్తలు క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన వివరాలపై తీవ్రంగా మండిపడుతున్నారు. 100శాతం సర్వే పూర్తికాకుండానే వెల్లడించిన వివరాల ప్రకారం బీసీలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా గణంకాల ప్రకారం బీసీల జనాభా 46.25 శాతమని వెల్లడి కాగా ఇది గతంలో 53శాతం పైగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికి సర్వే అసమగ్రంగా ఉండడమే కారణమని ఆరోపిస్తున్నారు.
క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే 96.9శాతం మంది నుంచే డాటా సేకరించినట్లు చెప్పారని, అలాంటప్పుడు ఇది సమగ్ర నివేదిక ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. సర్వేకు అందుబాటులో లేని, వివరాలు వెల్లడించని 3.10శాతం జనాభాకు సంబంధించిన వివరాలు అవసరం లేదా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం హడావుడిగా, గందరగోళంగా కులగణన నివేదికను బహిర్గతం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు. వాస్తవంగా సర్వే సమయంలో అందుబాటులో ఉన్న ప్రజలే వివరాలు అందజేశారు.
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు, స్థానికంగా లేని వాళ్లు, పలు కారణాలతో సర్వేకు వివరాలు అందించని వాళ్లు కూడా దాదాపు అన్ని చోట్ల ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలోనే ఎన్యుమరేటర్లకు కొందరి నుంచి సహాయనిరాకరణ కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. వివరాలు వెల్లడించడానికి ఇష్టం లేని వాళ్లను బలవంతం చేయకూడదన్నట్లుగానూ ఆదేశాలు ఉండడంతో కూడా పూర్తిస్థాయిలో వివరాలు రాలేదని సమాచారం. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల వివరాల సేకరణ సంపూర్ణంగా సాగలేదన్నది నిజం.
వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే మొత్తం 3.70కోట్ల జనాభాకు గానూ సర్వేలో 3.54కోట్ల మంది వివరాలనే సర్వే బృందాలు సేకరించగలిగినట్లు స్పష్టమైంది. మిగతా 16లక్షల మంది వివరాలు లేకుండా నివేదికను ఫైనల్ చేయడం, మంగళవారం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించనుండడం పట్ల జిల్లాలోని బీసీ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తొందరపాటు చర్యలతో బీసీలకు అన్యాయం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే బీసీ సంఘాలు, వివిధ రాజకీయపార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల
రామగిరి, ఫిబ్రవరి 3 : రెండేండ్ల ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్ ఐసెట్’ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)- 2025 షెడ్యూల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతను ఈ సంవత్సరం ఎంజీయూకు అప్పగించారు. అందులో భాగంగా ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఈ నెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. జూన్ 8, 9 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.
బీసీ అభ్యున్నతిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
మంత్రివర్గ ఉప సంఘం విడుదల చేసిన కులగణన నివేదిక అస్తవ్యస్తంగా అసంబద్ధంగా ఉంది. కుల గణన సర్వేలో 3.1 లక్షల కుటుంబాల వివరాలు పొందుపర్చలేదని ప్రభుత్వమే స్పష్టం చేసింది. అలాంటప్పుడు అది సమగ్ర నివేదిక ఎలా అవుతుంది. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలం చెందిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికే కులగణన నివేదిక బయటపెట్టింది కానీ బీసీలపై ప్రేమతో కాదు. రాష్ట్ర జనాభాలో సింహభాగం ఉన్న బీసీలను మభ్యపెట్టేందుకు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు రాబట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది జగమెరిగిన సత్యం. ఎన్ని హామీలు ఇచ్చినా రాష్ట్రంలోని బీసీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ వ్యతిరేకి. ఇప్పటికీ బీసీలు వెనుకబడి ఉన్నారంటే అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణం.
– నోముల భగత్ కుమార్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే
రిజర్వేషనన్ల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం బీసీల లెక్కలు తప్పుగా చూపిస్తున్నది. బీసీల జనాభా ప్రకారం పూర్తి సర్వే చేసి రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుపర్చాలి. రిజర్వేషన్లు అమలు చేయకుం డా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం. బీసీలకు ఎన్నికల రిజర్వేషన్ల పరంగా తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతాం.
-చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి, చందంపేట
కాంగ్రెస్ పాలనలో బీసీలకు మొండిచెయ్యి
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపి రాష్ట్రంలో బీసీలకు మొండిచేయి చూపే విధంగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నది. సుప్రీం కోర్డులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేయకుండా, బీసీ కులాలు, ఉప కులాల వర్గీకరణ చేయకుండా బడుగుబలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేయలేదు. వంద శాతం కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే బీసీలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారు.
– కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ జాతీయ కన్వీనర్,
బీసీ జనాభాను తక్కువగా చూపడం తగదు
ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో బీసీల జనాభా శాతాన్ని తక్కువగా చూపించడం తగదు. ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉంది. ఇది బీసీలను మోసం చేసేలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 60శాతానికి పైగా ఉంటే కేవలం 46శాతం ఉందని ప్రకటించడం హేయమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కులాల వారీగా జాబితా ప్రకటించాలి.
– జాజుల లింగంగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, మిర్యాలగూడ
బీసీ జనాభాపై తప్పుడు సర్వే లెక్కలు మానుకోవాలి
ప్రభుత్వం బీసీలపై సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల పట్ల చులకనగా చూస్తున్నది. గతంలో బీసీల జనాభా పదిశాతం లోపు అని, ఇప్పుడు 15శాతం పెరిగిందని చెప్తున్నది. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం పెరిగితే, 50 లక్షల మంది బీసీల జనాభాను తక్కువ చేసి చూపడంలో ప్రభుత్వ వైఖరి అర్థం కావడం లేదు. బీసీల జనాభాపై తప్పుడు లెక్కలు మానుకోవాలి. బీసీలందరూ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయం.
-పిడిగం నాగయ్యముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుమలగిరి (సాగర్)
మరోసారి సర్వే చేయాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో బీసీల జనాభాను తప్పుగా చూపించారు. సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగింది. 2014లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే 21లక్షల మందిని తక్కువగా చూపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మరోసారి వివరాలు సేకరించాలి.
-కట్టా మల్లేశ్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, వేములపల్లి