నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 04 : మేమెంతో మాకంత వాటా.. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో కొలువైన వినాయకుడికి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వర మహారాజ్ గారిని బీసీలు కోరడం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన తాము 110 కులాలకు పైగా ఉన్నాం. మొత్తం జనాభాలో సుమారు 60 శాతం ఉన్నట్లు ప్రాథమికంగా ప్రభుత్వ అంచనాలు. గత 75 సంవత్సరాలుగా కేవలం జెండాలు మోసే కార్యకర్తలాగానే అన్ని రాజకీయ పార్టీలు బీసీలను వాడుకోవడం జరుగుతుంది.
ఇప్పటికైనా బీసీ ప్రజానీకంపైన విఘ్నేశ్వరుడు దయ ఉంచి మీ ఆశీస్సులతోటి చట్టసభల్లో అలాగే స్థానిక సంస్థలు ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ బద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధిపతులకు మంచి మనసు ప్రసాదించాలి. ఎటువంటి అడ్డంకులైన తొలగించి రిజర్వేషన్లు కల్పించే విధంగా నిర్ణయం తీసుకొనుటకు విఘ్నేశ్వర మహారాజుకు విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మున్నాస్ వినయ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజ్ కుమార్ యాదవ్, రమేశ్, పృధ్విరాజ్, ప్రభాకర్, జితేందర్, వినయ్, పవన్ పాల్గొన్నారు.