నల్లగొండ రూరల్, అక్టోబర్ 07 : బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్లో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపూలే సెంటర్ వద్ద బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులపై జరిపిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్న జనాభా కంటే 18 శాతం రిజర్వేషన్లు తక్కువ చేసి 42 శాతంతో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు గత 80 ఏళ్లుగా 90 శాతం పదవులు అనుభవిస్తూ బీసీలకు రావాల్సిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ, బీసీ రిజర్వేషన్లు అమలు కావంటూ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు అదేపనిగా ప్రచారం గావిస్తున్నారని, దీనిని ఎంత మాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. 50 శాతం సామాజిక రిజర్వేషన్లు దాటకూడదని ఎక్కడా లేదని అగ్ర వర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన నాడే 50 శాతం సీలింగ్ త్తిపోయిందని, బీసీలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు 50 శాతం సీలింగ్ గుర్తుకు రావడం చాలా శోచనీయమన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కేసులు వేసి, బీసీలకు రావాల్సిన వాటాను అగ్ర వర్ణాలు తన్నుకపోతే చూస్తూ ఊరుకోమని, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల భరతం పట్టడానికి బీసీలంతా ఐక్యమై రాష్ట్రంలో అగ్గి రాజేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లకు గవర్నర్చే ఆమోదముద్ర వేసే బాధ్యత బిజెపి తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రిజర్వేషన్లు పెంచే బాధ్యత బిజెపి తీసుకోవాలని, రిజర్వేషన్లు ఆగిపోతే దానికి బిజెపిదే బాధ్యత అని చక్రహరి రామరాజు అన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడాలని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న రెడ్డిలు ఎందుకు ఖండించడం లేదని, రెడ్డిలు ఎటువైపో తేల్చుకోవాలన్నారు. సమాజంలో ఉన్న చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు అట్టడుగు వారి హక్కుల కోసం పోరాటం చేసి అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటు పడ్డారని వారిని ఎప్పటికీ తాము గౌరవిస్తామన్నారు. ఈ సమావేశంలో కాసోజు విశ్వనాథం, నేలపట్ల సత్యనారాయణ, సోమ మల్లన్న, నకిరేకంటి కాశయ్య గౌడ్, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాసుదేవుల వెంకట నరసయ్య, చిక్కుల రాములు, సొల్లేటి రమేష్, గంజి భిక్షమయ్య, ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, ఎరుకల శంకర్ గౌడ్, కస్తూరి దామోదర్, శంకరాచారి, కంది సూర్యనారాయణ, శ్రీను, వేణు, లాలయ్య గౌడ్, చాగంటి రాములు ముదిరాజ్, జె.ఇంద్రయ్య, వెంకటాములు, బండారి గోవర్ధన్ గౌడ్, బండారి గోవర్ధన్ నాగరాజు, వీరమల్ల, జేరిపోతుల శంకర్ గౌడ్ పాల్గొన్నారు.