నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : కుల గణనలో తగిన ప్రామాణికాలు పాటించ లేదని, ఫలితంగా బీసీల సంఖ్య తగ్గిపోయిందని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీసీ సామాజికవర్గంతోపాటు సంఘాల నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన కుల గణన నివేదికలో బీసీ సంఖ్యను తక్కువ చేసి చూపించడం అన్యాయమం టూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల భవితవ్యాన్ని నిర్ధేశించే, కోటాను నిర్ధారించే నివేదికపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని దుయ్యబడుతున్నారు. సర్వే నివేదికలోని తప్పులను సరిదిద్దకుండా ప్రభుత్వం ముందుకు సాగితే బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని స్పష్టం చేస్తున్నారు. గత జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుత కుల గణన నివేదిక కరెక్ట్ కాదని తెలుస్తుందని చెప్తున్నారు. కుల గణన నివేదికలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపడం ద్వారా రానున్న కాలంలో ఉద్యోగాలు, రాజకీయ అవకాశాల్లో తగిన ప్రాతినిధ్యాన్ని బీసీలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వెల్లడించిన కుల గణన వివరాలపై ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయని, ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని అంటున్నారు. కులగణన నివేదికపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు పడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగుతున్నారు.
ప్రభుత్వ నివేదికను అంగీకరించం
బీసీలు 46 శాతమే ఉన్నారని చెప్తున్న ప్రభుత్వ నివేదికను తాము అంగీకరించబోమని నల్లగొండలో తేల్చిచెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రోజులో జరిపిన కుటుంబ సర్వేలో బొంబాయి వంటి ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారు సైతం సర్వేలో పాల్గొన్నారని గుర్తు చేస్తూ… ఆ నాటి సర్వేలోనే 51 శాతం బీసీలు తేలిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో మాత్రం తక్కువగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో బీసీ విద్యార్థి, సంక్షేమ సంఘాలతోపాటు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కులగణన నివేదికలను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన రిపోర్టులను తిరస్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు పందుల సైదులు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్థన్‌గౌడ్ ప్రకటించారు. పలుచోట్ల బీసీ సంఘాల ఆధ్వర్వంలో కులగణన నివేదికపై ఆందోళనలు కొనసాగాయి.
కులగణనలో పారదర్శకత కరువు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆధిపత్య వర్గాలే కులగణనను సక్రమంగా జరుగనివ్వలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై వెనుకబడిన వర్గాలు తిరుగబడుతాయని ముందే పసిగట్టి ఓసీ జనాభాను పెంచి చూపించారు. 2014లో కేసీఆర్ ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అప్పుడు ఎలాంటి విమర్శలూ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 50 రోజులు సర్వే చేసినా పారదర్శకత లోపించింది. సర్వే చేసిన ఎన్యూమరేటర్లపై ఉన్నతాధికారులు నియంత్రణ చేశారు. ప్రభుత్వ కులగణనను చాలా చులకనగా చూశారు. అందుకే తప్పుల తడకగా సర్వే జరిగింది. ఈ సర్వే 100 శాతం వాస్తవికం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సరైంది కాదు. వార్డుల వారీగా, గ్రామ, మండల, జిల్లాల వారీగా జనాభా ఎంత ఉందో యూనిట్లను ప్రకటించాలి. కాంగ్రెస్ సంకలు గుద్దుకున్నంత మాత్రాన సామాజిక న్యాయం అమలైనట్లు కాదు.-పందుల సైదులు, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ
బీసీలను తగ్గిస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. కుల గణన సర్వేలో బీసీ జనాభాను తగ్గించి చూపడం దారుణం. 2011 నుంచి నేటి వరకు రాష్ట్రంలో బీసీల జనాభా పెరిగిందే తప్ప తగ్గలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్వే లెక్కల కంటే బీసీ జనాభాను తగ్గించి రిజర్వేషన్‌ను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. గత సర్వేలో ఓసీలు 7శాతం ఉంటే ప్రస్తుతం 16శాతానికి ఎలా పెరిగారు.? బీసీలు ఎలా తగ్గారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీసీ జనాభా పెరిగితే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం తగ్గించి అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రభుత్వం పునారాలోచించి కుల గణన లెక్కల సర్వేను సవరించాలి.
– నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, సూర్యాపేట
కులగణన ఓ నాటకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులగణన కేవలం మొక్కుబడి ప్రక్రియ. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఆడుతున్న నాటకం. సామాజిక అభ్యన్నతి కోసం ఆలోచన చేసి నిజాయతీగా చేపట్టినట్లుగా లేదు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సామాజిక న్యాయ జపం చేయడంతో ఇక్కడ ఉన్న అగ్రకులాల నాయకులు ఆయన మాటలను గౌరవించినట్లుగా నటించి బీసీ కులగణన చేశారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్సీ బహిరంగంగానే సర్వే రిపోర్టును తగులబెట్టారు. దీని వెనుక ఆ పార్టీ నాయకుల కుట్ర ఉందని అనడంతో ఈ నివేదికలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. సర్వేను మొక్కబడి కార్యక్రమంగా పూర్తి చేసి 46 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అంటూనే మళ్లీ కేంద్ర ప్రభుత్వం అని మెలిక పెట్టడం వెనుక కుట్ర ఉన్నది. ఇలాంటి చౌకబారు ఆలోచనలు చేయడం సీఎం రేవంత్‌కు కొత్తేం కాదు. జనం ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మకుండా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేయాలి.
– పుట్ట కిశోర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సూర్యాపేట
అన్యాయం చేయాలని చూస్తున్నారు
ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో అసంపూర్తి సమాచారం ఉంది. అగ్ర వర్ణాల కులస్తుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేసినట్లు అనిపిస్తుంది. 100 శాతం సర్వే చేయకుండా నామ మాత్రంగానే చేసి బీసీ జనాభాను కావాలనే తక్కువ చేసి చూపారు. గతంలో తక్కువున్న ఓసీ సంఖ్య పెరిగినప్పుడు బీసీల సంఖ్య ఎలా తగ్గుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేవలం బీసీ ఓట్ల కోసం కులగణన చేపట్టి, 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాను 46 శాతమే అని చూపెట్టడం విచారకరం. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇంకా 8 శాతం సర్వే జరుగలేదని చెప్పడమే ఇందుకు ఉదాహరణ. పదేండ్లలో కేవలం 2 లక్షల జనాభా బీసీలు పెరిగారని చూపెట్టడం విడ్డూరం. మరోసారి కుల గణన చేపట్టి బీసీ జనాభా ప్రకటించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ స్థానాలు పెంచి బీసీలకు రాజకీయంగా ప్రోత్సహించాలి.
– పెద్దిశెట్టి సత్యనారాయణ, బీసీ నాయకుడు, కొండమల్లేపల్లి
నిజ నిర్ధారణ కమిటీ వేయాలి
బీసీ కుల గణనను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా చేపట్టలేదు. సర్వే రిపోర్టులో నిజాలు దాచిపెట్టింది. రాష్ట్రంలో బీసీ జనాభా 51శాతం ఉందని గతంలో సర్వేలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన సర్వేలో మాత్రం 46 శాతమే ఉండడమేంటి.? దీనివల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగబోతున్నది. గతంలో 10 శాతం ఉన్న ఓసీలు నేడు 15 శాతానికి ఎగబాకారని తాజా సర్వే చెప్పింది. ఇది ముమ్మాటికి బూటకపు సర్వే. బీసీలను తక్కువ చూపడం వల్ల ఎన్నికల రిజర్వేషన్లు తారుమారు అవుతాయి. జనాభా ప్రాతిపదికన కులాల శాతాన్ని బట్టి నిధులు కేటాయిస్తే నష్టపోయేది బీసీలే. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీ బలగాన్ని కావాలనే తక్కువ చేసి చూపిస్తుంది. కులగణనపై నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజం నిగ్గు తేల్చాలి.
– చౌగాని భిక్షం గౌడ్,జిల్లా రైతు బంధు సమితి మాజీ సభ్యుడు, మిర్యాలగూడ
రిపోర్టును గ్రామాల వారీగా ప్రకటించాలి
రాష్ట్ర జనాభాలో 60శాతం ఉన్న బీసీలను కేవలం 46శాతానికి చూపిస్తూ కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించాలనే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే చేసినప్పుడు 56శాతం బీసీలను గుర్తించగా 46శాతం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం బీసీలను అవమానించడమే. కుల గణన రిపోర్టులను గ్రామాల వారీగా ప్రకటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్‌ను 50శాతానికి పెంచి నిర్వహించాలి.
– కూనూరు శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు, రామన్నపేట