ఒక్కేసి పువ్వేసి చందమామ..
ఒక్క జామాయె చందమామ…
రామ.. రామ.. ఉయ్యాలో…
రామనే శ్రీరామ ఉయ్యాలో…
రామగిరి, నేరేడుచర్ల, అక్టోబర్ 1: తెలంగాణ ఆడబిడ్డల అతిపెద్ద వేడుక బతుకుమ్మకు వేళ అయ్యింది. బుధవారం ఎంగిలిపువ్వుతో తొమ్మిది రోజుల పూల సంబురం ప్రారంభం కానున్నది. ఇక రోజూ ఊరూవాడ ఉయ్యాల పాటలు హోరెత్తనున్నాయి. తీరొక్క పూలను తెచ్చి, పేర్చి ఆడబిడ్డలు సంతోషంగా బతుకమ్మ ఆడనున్నారు. భాద్రపద బహుళ పంచమి మొదలుకుని మహాలయ అమావాస్య (పితృ అమావాస్య) వరకు ఆడబిడ్డలు బొడ్డెమ్మలు ఆడతారు. అనంతరం బతుకమ్మ పండుగ మొదలవుతుంది. పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమై సద్దుల బతుకమ్మతో సంపూర్ణం అవుతాయి. ఈ 9 రోజులు భక్తిశ్రద్ధలతో 9 రకాలుగా బతుకమ్మలను పేర్చి నైవేద్యాలను సమర్పిస్తారు.
మొదటి రోజు.. ఎంగిలిపువ్వు బతుకమ్మ
రెండో రోజు.. అటుకుల బతుకమ్మ
మూడో రోజు.. ముద్ద పప్పు బతుకమ్మ
నాలుగో రోజు.. బియ్యం బతుకమ్మ
ఐదో రోజు.. అట్ల బతుకమ్మ
ఆరో రోజు.. అలిగిన బతుకమ్మ
7ఏడో రోజు.. వేపకాయ బతుకమ్మ
ఎనిమిదో రోజు.. వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదో రోజు… సద్దుల బతుకమ్మ