‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98శాతం పూర్తయ్యాయి. మళ్లీ అధికారంలోకి రాగానే నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. త్వరలోనే సాగు నీరు అందిస్తాం. తద్వారా లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి’
-గత నెల భువనగిరిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి
చివరి ఎకరా వరకు నీరందించి కరువును తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా
జిల్లా రైతుల కష్టాలు తీర్చేందుకు కాళేశ్వరం జలాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 98శాతం పనులు పూర్తయ్యాయి. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,65,500 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం పరిహారం చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరగా సాగు నీరందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటకంగా పరిఢవిల్లనున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్ట్ 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో జిల్లాలో బస్వాపూర్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దీని కోసం ప్రభుత్వం రూ.1652.26 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు 1557.69కోట్ల పనులు పూర్తయ్యాయి. మొత్తం జలాశయం, ఎగువ, దిగువ కాల్వలు నిర్మించేందుకు 5,891 ఎకరాల భూసేకరణ చేపట్టారు. మొత్తం 50.530 కిలో మీటర్ల ప్రధాన కాల్వలో దిగువ కాల్వ 49.883 కిలో మీటర్లు ఉంది. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లిలో 36.609 కిలో మీటర్ల వద్ద కాళేశ్వరం నృసింహసాగర్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. బస్వాపూర్‌లోని నీటిని దిగువ భాగానికి మళ్లీంచేందుకు ప్రధాన కాల్వతోపాటు ఆయా ప్రాంతాలకు డిస్ట్రిబ్యూటర్, మైనర్, సబ్ మైనర్ కాల్వలను నిర్మిస్తున్నారు. మొత్తం 13 డిస్ట్రిబ్యూటర్ కాల్వలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటర్ కెనాల్‌కు ఆయా ప్రాంతాలకు సాగు నీరు అందేలా మైనర్లు, సబ్ మైనర్లు, క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు.
బస్వాపూర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తయ్యాయి. భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపూర్, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండాకు ప్యాకేజీ పూర్తయ్యింది. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ. 7.60లక్షలను ప్రభుత్వం అందించింది. ఇంట్లో మేజర్ పిల్లలు ఉన్నా.. వారికి కూడా ప్యాకేజీ వర్తింపజేసింది. బీఎన్ తిమ్మాపూర్‌లో మొదటి విడుతలో రూ.50కోట్లతో 655 మందికి, రెండో విడుతలో 401మందికి రూ.33కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. పునరావాసం కింద ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు భువనగిరి మండల పరిధిలోని హుస్నాబాద్‌లో సర్వే నంబర్ 107లో 1,056మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 200 గజాలు ఇచ్చారు. ఇంకా ఇంటి నష్టపరిహారం చెల్లింపులు చేయాల్సి ఉంది. ఎన్నికల తర్వాత చెల్లించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బస్వాపూర్‌తో యాద్రాద్రిభువనగిరి జిల్లాలోని మండలాలతో పాటు, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాలు సస్యశ్యామలంగా మారనున్నాయి. సాగునీటితోపాటు తాగునీరు కూడా అందనుంది. ఆలేరు, భువనగిరి నియోజవర్గాలతోపాటు మోత్కూరు, నల్లగొండ జిల్లాలోని రామన్నపేట, చిట్యాల, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు సాగునీరు అందనుంది. మొత్తం 1,65,500 ఎకరాల ఆయకట్టుకు అందనుండగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,63,175 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 2,325 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. అంతేగాకుండా మరో హైలెవల్ మెయిన్ కెనాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బస్వాపూర్ జలాశయం 13.7 కిలో మీటర్ చెరువు కట్ట వద్ద నిర్మించిన అలుగు నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ నిర్మించనున్నారు. దీని ద్వారా భువనగిరి మండలంలో మరో 22,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
కాళేశ్వరం జిల్లాలు ఇప్పటికే జిల్లాను తాకాయి. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం తొలి ఫలాలను జిలాలోని ఆలేరు నియోజకవర్గానికి అందాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాలకు చెంతకు చేరాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. అదే విధంగా దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలంలో కాళేశ్వరం జలాలు పారుతున్నాయి. దీంతో ఆయా మండలాల్లో పంటలు సస్యశ్యామలమయ్యాయి. ఎవుసానికి జీవం పోసిన గోదావరి జలాలతో 3 మండలాల రైతులు సంతోషంగా ఉన్నారు.పర్యాటక
లక్షల ఎకరాలను గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేయనున్న నృసింహ రిజర్వాయర్ ప్రాంతం పర్యాటకంగా అలరించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ బోటింగ్, పార్కులు, మ్యూజికల్ ఫౌంటేన్లు ఏర్పాటు చేయనున్నారు. యాదగిరిగుట్ట దర్శనార్థం వచ్చే భక్తులకు కనువిందు చేయనుంది. సినిమా షూటింగ్‌లు, డెస్టినీ మ్యారెజ్లకు కేరాఫ్‌గా మారనుంది. రాయగిరి మినీ చెరువు వద్ద ఏర్పాటైన మినీ శిల్పారామం, యాదరుషి పేరుతో మెడిటేషన్ సెంటర్ ఏర్పాటుతో ఈ ప్రాంతం కొత్త శోభను సంతరించుకోనుంది.