మునగాల, సెప్టెంబర్ 11 : కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునగాల మండలం బరాఖత్గూడెం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో వీధులు బురదతో నిండిపోయాయని, డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో వీధులన్నీ బురదమయంగా మారాయంటూ గ్రామానికి చెందిన రాయిరాల సుమన్ అనే యువకుడు గురువారం బురదలో కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోని ఇందిరమ్మ కాలనీ ఎటువంటి అభివృద్ధికీ నోచుకోలేదన్నారు.
వర్షం వచ్చినప్పుడు కాలనీ వాసులు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు బురదలోనే నడుస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి నిధులు వెచ్చించకపోవడం దారుణమన్నారు. గతంలో గ్రామానికి నిధులు వస్తే మాజీ ఎంపీటీసీ ఇంటి చుట్టూ రోడ్లు వేశారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇందిరమ్మ కాలనీకి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు.