నల్లగొండ, సెప్టెంబర్ 12: ఉపాధి కోసం పేద మహిళలు శిక్షణ పొందుతున్న సంస్థ అది. టైలరింగ్ పేరుతో కొందరు.. బ్యూటీషన్ పేరుతో మరికొందరు.. మగ్గం, అగరుబత్తీలు, చేతి కుట్లు, అల్లికలు ఇలా… అక్కడికి శిక్షణ కోసం వస్తున్న వారిని ఆ సంస్థ కీలకోద్యోగి గలీజు పనులకు వినియోగిస్తూ కీచకానందం పొందుతున్నాడు. ఒకటి, రెండు నెలలు కాదు.. ఏకంగా రెండ్లేండ్ల నుంచి ఆయనే కేంద్ర బిందువై బ్యాంకు ఉద్యోగులకు ఆ సంస్థను సాని కొంపలా మార్చటమే కాకుండా సంస్థలోకి శిక్షణ కోసం వచ్చే వారితో పాటు వారికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చే ట్రైనర్స్పైనా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండేండ్ల కాలంలో ఆరుగురు మహిళా ట్రైనర్స్ అక్కడ ఉద్యోగాలు మానేయగా… పలువురు శిక్షణ కోసం వచ్చే మహిళలు వారం తిరగక ముందే మానేసి మరొకరికి చెప్పుకోలేక ఇంటిబాట పట్టారట. ఇంకొందరైతే మహిళా టైనర్స్‌కు చెప్పుకోని బోరుమని విలపించటం విశేషం. ఇటీవల ఓ మహిళ జిల్లా కేంద్రంలోని ఓ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆమెకు నచ్చచెప్పి పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని చెప్పటంతో పాటు సదరు ఉద్యోగిని విచారణ పేరుతో ఒకరోజు పోలీసుస్టేషన్లో ఉంచి క్లోస్ చేశారనే విమర్శలు వస్తున్నాయి.
జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డులో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్సెటీ)లో రెండేండ్లుగా గలీజ్ పనులు కొనసాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థలో బాధ్యతలు చేపట్టిన ఓ ఉద్యోగి కేంద్ర బిందువై సాని పనులకు సహకారం అందిస్తుండగా.. అక్కడకు బ్యాంకు ఉద్యోగులు వచ్చి తమ ఇల్లీగల్ పనులు కానిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకులను నియంత్రించే అధికారే అక్కడ ఈ పనులకు తెరతీసినట్టు సమాచారం.
కాస్త అందంగా ఉన్నా.. లేదంటే వయసులో ఉన్నా సరే.. అలాంటి మహిళలు వేధింపులకు గురైతున్నట్లు సమాచారం. అక్కడ పని చేస్తున్న ఉద్యోగులతో పాటు శిక్షణ ఇవ్వడానికి వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి పనిచేసే ఆరుగురు మహిళా ట్రైనర్స్ ఉద్యోగాలు మానేసి సొంత పనులు చేసుకోవడం విశేషం. అక్కడకు శిక్షణకు వచ్చే మహిళల్లో కొందరిని ఎంచుకొని వారిని పదేపదే వారి రూముల్లోకి పిలవడం.. సమస్యలు చెప్పాలని, మీ ఆయన ఏం చేస్తాడని.. నీకు బ్యాంకు రుణం ఇప్పిస్తానని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
ఒక్కో ప్రోగ్రాం నెల రోజుల పాటు ఉంటుండగా.. ప్రోగ్రాం చివరలో సెలబ్రేషన్ పేరుతో రొమాంటిక్, ఐటమ్స్ సాంగ్స్‌కు మహిళలను డాన్స్ వేయాలని ఇబ్బంది పెట్టడం వారి కీచకత్వానికి నిదర్శనం. ఇటీవల ఒక బ్యాచ్ పూర్తి కావడంతో వారితో ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా.. రింబోలా.. రింబోలా.. రింబోలా’ అనే సాంగ్‌కు మహిళలతో ఆ ఉద్యోగి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆయన ఇల్లీగల్ పనులపై ఈ నెల 10న ‘వెకిలి నవ్వులు..మకిలి మాటలు..!’ శీర్షికతో నమస్తే తెలంగాణ కథనం రాయగా బ్యాంకు అధికారులు విచారణకు వచ్చినప్పటికీ ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడం గమనార్హం.