నిడమనూరు, మే 20 : నిడమనూరు మండల కేంద్రంలోని తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు ఖాతాదారుల జేబులకు చిల్లు పడుతున్నది. బ్యాంకుల్లో ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకు తపాలా శాఖ ద్వారా అందాల్సిన ఏటీఎం కార్డులను బట్వాడా చేయడం లేదు. ఏటీఎం కార్డును పొందేందుకు కచ్చితమైన చిరునామా వివరాలను నమోదు చేస్తున్నా.. తపాలా శాఖ పోస్టుమేన్లు కార్డులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కార్డులను ఖాతాదారులకు కాకుండా నేరుగా సంబంధిత బ్యాంకుకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ కారణంగా బ్యాంకు ఖాతాదారులకు ఎదురు చూపులు తప్పకపోగా ఏటీఎం రిటర్న్ చార్జీల పేరుతో బ్యాంకులు నిర్దేశిత రుసుమును వసూలు చేస్తుండటం భారంగా మారింది. ఏటీఎం కార్డు కోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులు బ్యాంకులో కార్డులను పొందేందుకు ఏటీఎం రిటర్న్ చార్జీల పేరుతో రూ.118 చెల్లించాల్సి వస్తుండటంతో ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిడమనూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏటీఎం కార్డుల కోసం పలువురు రెండు నెలల కిత్రం ధరఖాస్తు చేసుకున్నారు.
ఏటీఎం కార్డులు తపాలా శాఖ ద్వారా నిడమనూరుకు చేరుకున్నా పోస్టుమేన్ సంబంధిత ఖాతాదారులకు బట్వాడా చేయకుండా నేరుగా బ్యాంకుకు కార్డులను అప్పగించారు. దీంతో ఖాతాదారులు కార్డు కోసం ఎదురు చూసి తపాలా శాఖను సంప్రదించగా బట్వాడా చేసినట్లు ఆన్లైన్ రికార్డులు చూపుతున్నాయి. బ్యాంకులో ఆరా తీయగా బ్యాంకుకు పోస్టుమేన్ అప్పగించినట్లు తేటతెల్లమైంది. కార్డులు పొందేందుకు బ్యాంకుకు వచ్చిన వినియోగదారులు కార్డులు పొందాలంటే ఏటీఎం రిటర్న్ చార్జీలు చెల్లించడం అనివార్యమంటూ బ్యాంకు అధికారులు పేర్కొనడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. చేసేది లేక రిటర్న్ చార్జీలు చెల్లించి కార్డులు తీసుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా వచ్చిన ఉత్తరాలు, పార్సిళ్లు సంబంధిత చిరునామాలో బట్వాడా చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పోస్టల్ సిబ్బంది పని తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై సబ్ పోస్టుమాస్టర్ ఎం.మహేశ్‌కుమార్ వివరణనిస్తూ విచారణ చేపడుతామని తెలిపారు. ఎస్బీఐ ఏటీఎం కార్డుల చిరునామాలు సరిగా లేకపోయిన సందర్భంలో మాత్రమే బ్యాంకుకు అప్పగిస్తామని, చిరునామా సక్రమంగా ఉన్నా బట్వాడా చేయకపోయినట్లయితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోస్ట్‌మేన్ నిర్లక్ష్యంతో చాలా ఇబ్బందులు పడ్డా. ఏటీఎం కార్డు కోసం నెలన్నర రోజులుగా ఎదురు చూశా. చివరకు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా తపాలా శాఖ కార్యాలయంలో తెలుసుకోమన్నారు. అక్కడికి వెళ్తే కార్డు బ్యాంకులో బట్వాడా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఏటీఎం కార్డు పొందాలంటే ఏటీఎం రిటర్న్ చార్జి రూ.118 చెల్లించాలని బ్యాంకు అధికారులు చెప్పారు. చేసేదేమీ లేక రుసుము చెల్లించి కార్డు తీసుకున్నా. ఇంకా చాలా మందివి కార్డులు బ్యాంకులో ఉన్నాయి.