దామరచర్ల, జూలై 17 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా గత నెల రోజులుగా ప్లాంట్ లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాజమాన్యం ప్లాంట్ లో ఎలాంటి నిరసనలు తెలుపకుండా ఈ నెల 16వ తేదీన నిషేదాజ్ఞలు జారీ చేసింది. యాజమాన్యం తీరుపై జేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్ స్టేజి-1, స్టేజి- 2 యాష్ కోల్ ప్లాంట్లను ప్రైవేటీకరణ చేసేందుకు గాను గత నెల 12న రూ.255 కోట్లకు టెండర్ పిలువడం జరిగింది. టెండర్ కు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో టెండర్ గడువు ఇప్పటికీ రెండుసార్లు వాయిదా వేస్తూ గడువును పొడిగించింది. ప్లాంట్ లోని యాష్ కూల్ ప్లాంట్లను ప్రైవేటీకరణ చేస్తే కార్మికులు, ఉద్యోగులు, స్థానికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల నాయకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. కాగా నిరసనలు, ఆందోళన తెలపకుండా ప్లాంట్ యాజమాన్యం నిషేదాజ్ఞలు విధించడం ఉద్యోగ హక్కులను కాలరాయడమేనని ఉద్యోగ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్లాంటు ప్రైవేటీకరణను కోసం పిలిచిన టెండర్లను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.