సూర్యాపేట టౌన్, డిసెంబర్ 20 : తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దిగ్గజం మాజీ మంత్రి కేటీఆర్ జోలికి వస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ హెచ్చరించారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు జైళ్లు, కేసులు కొత్తకాదని, అక్రమ అరెస్టులను ప్రజ లు సహించరని అన్నారు. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయకున్నా తప్పుడు కేసులతో అరెస్టు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రేవంత్‌రెడ్డి అవినీతిపై పోరాడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. ఏం చేసినా చెల్లుతుందని అనుకోవడం అవివేకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై ఈ-కార్ రేస్ అంటూ తప్పులు కేసులు పెట్టడంతో ప్రజల్లో అభాసు పాలవుతారని చెప్పారు. హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్ రేస్‌ను ప్రభుత్వ నిబంధనలకు లోబడి కేటీఆర్ పెట్టారని, అందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నాయని తెలిపారు.
కేటీఆర్‌పై ఫోన్ టాపింగ్, జన్వాడ ఫామ్ హౌజ్, డ్రగ్స్ అని ఎన్నో కేసులు పెట్టాలని చూసినా ఒక్క కేసు నిలబడలేదని, కోర్టులో చీవాట్లు తినాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను జైల్లో పెట్టే దురాలోచనకు ప్రభుత్వం పూనుకుంటుందని ఆరోపించారు. ఈ-కార్ రేస్‌లోని వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, కేటీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ ఆత్మకూర్.ఎస్ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, నాయకులు ఉప్పల ఆనంద్, బూర బాలసైదులు, ఈదుల యాదగిరి, బండారు రాజా, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, మీనయ్య పాల్గొన్నారు.