చిట్యాల, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకూ చేరాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెల్మినేడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని కోరారు. గతంలో వెనుకబడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని కేవలం తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వెంటే నడుస్తున్నారన్నారు.
మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు, ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల కోసం ఆసరా పింఛన్లు, దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు వంటి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తో తమ పనైపోతుందని భయపడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలా వ్యవహరిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మళ్లీ బీఆర్ఎస్ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.
కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి : ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొన్ని గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్ నాయకుల్లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని, స్థానిక నాయకత్వం వారి కుట్రలను తిప్పి కొట్టి కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందేలా చూడాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పని చేస్తున్నానని, ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సమ్మేళనానికి వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్తతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొన్నారు. వారితోనే కలిసి భోజనం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారంతా సమన్వయంతో పని చేసి బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆవుల అయిలయ్య అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, వెల్మినేడు సింగిల్ విండో చైర్మన్ రుద్రారం భిక్షపతి, వెల్మినేడు ఎంపీటీసీ దేవరపల్లి సత్తిరెడ్డి, చిట్యాల సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండె సైదులు, పార్టీ మండల కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, అనుబంధ సంఘాల మండలాధ్యక్షులు తుమ్మల నాగరాజురెడ్డి, కొలను సతీశ్, చెర్కుపల్లి శషిరేఖ, వాజిద్, పిశాటి భీష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.