రామగిరి, ఆగస్టు 25 : నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండ్రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం దేవరకొండ ప్రాంతం నుంచి ప్రసవానికి వచ్చిన మహిళకు సకాలంలో చికిత్స చేయకపోవడంతో కుర్చీలోనే ప్రసవం జరిగిన విషయం విదితమే. ఈ విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో శనివారం డాక్టర్లు మూకుమ్మడిగా సామూహిక సెలవులు పెట్టడంతో వైద్య సేవలు కొనసాగలేదు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానకు మాడ్గులపల్లి మండలం గారకుంటపాలెం గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీలతను మూడో కాన్పు కోసం జిల్లా కేంద్ర దవాఖానలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి శుక్రవారం సాయంత్రం ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.
అయితే.. వైద్యులు వచ్చి పరిశీలించలేదు. నర్సులు మాత్రమే వచ్చి డాక్టర్లు రేపు ఉదయం 10గంటలకు వస్తారని నిర్లక్ష్యంగా వ్యహరించారు. శనివారం వైద్యులు, సిబ్బందిలో చాలా మంది మూకుమ్మడిగా సెలవులు పెట్టారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయకపోవడంతో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో ప్రైవేట్ ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లేందుకు బాధితురాలి బంధువులు ప్రయత్నిస్తుండగా.. సిబ్బంది, డ్యూటీ డాక్టర్ స్వరూపారాణి అడ్డం తిరిగి ఆపరేషన్ చేస్తామని లోపలికి తీసుకెళ్లారు. ఆమెకు స్కాన్ చేసి తల్లీబిడ్డ బాగానే ఉన్నారు.. ఆందోళన అవసరం లేదని చెప్పారు. ఆ వెంటనే మరో డాక్టర్‌కు ఫోన్ చేయగా వచ్చారు. ఆయనతో కలిసి హడావుడిగా రాత్రి 8గంటల సమయంలో ఆపరేషన్ చేయించారు. కానీ.. గర్భంలోనే మగ శిశువు మృతిచెందింది. డా క్టర్లు ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతిచెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. శిశువు ఒంటిపై అక్కడక్కడ గాయాలు ఉండడంతో వైద్యురాలితో గొడవకు దిగారు. రాత్రి నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.
కలెక్టర్ ఆదేశాలు అమలు చేయని వైద్యులు
నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సంఘటనలపై స్పందించిన కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వర వైద్యం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని చాలా పర్యాయాలు హెచ్చరించారు. అయినప్పటికీ సిబ్బంది, డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తుండటంతో కలెక్టర్ ఒక జీఓ తీశారు. రోజూ జిల్లా స్థాయి అధికారి ఒకరు ఆసుపత్రిని తనిఖీ చేస్తారు. ఎవరైనా పనితనం సక్రమంగా లేకుంటే చర్యలుంటాయని ఆ జీఓలో పేర్కొన్నారు. అయినప్పటికీ బేఖాతరు చేస్తూ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యహరించడంతోనే మరో ఘటన జరిగింది.
ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది స్పందించలేదు
నా భార్య శ్రీలతను ప్రసవం కోసం శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చాం. డాక్టర్లు లేరు.. రేపు ఉదయం 10గంటలకు వస్తారని అక్కడున్న నర్సులు చెప్పారు. ఎలాంటి వైద్యం చేయలేదు. శ్రీలత ఇబ్బంది పడుతుండటంతో గ్లూకోజు మాత్రం పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ రాకపోవడంతో సాయంత్రం 6గంటలకు ప్రైవేట్ ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్త్తుండగా.. డాక్టర్, నర్సులు అడ్డం తిరిగి మా ఉద్యోగాలు పోతాయి.. ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు అంటూ అడ్డగించారు. మరో డాక్టర్‌కు ఫోన్ చేయడంతో ఉదయం నుంచి రాని డాక్టర్ ఐదు నిమిషాల్లో వచ్చి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. రాత్రి బలవంతంగా డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి డ్రస్ వేసుకుని బయటకు వచ్చి టెన్షన్ టెన్షన్‌గా ఫోన్ మాట్లాడి.. గర్భంలో పాపకు ఎఫెక్ట్ అయిందన్నారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు పెద్ద ప్రాణానికి, చిన్న ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. డాక్టర్లు వెంటనే స్పందించకపోవడంతోనే ఇలా జరిగింది. శిశువు ఒంటిపై అక్కడక్కడ చిన్న చిన్న గాయాలున్నాయి. దీనిపై విచారణ చేసి మాకు న్యాయం చేయాలి.
– రాజు, శ్రీలత భర్త