రామగిరి, జనవరి 22 : యావత్ హిందూ సమాజం వేచిచూసిన సుదీర్ఘ స్వప్నం సోమవారం సాకారమైంది. అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుకను చూస్తూ భక్తులు తన్మయత్వం పొందారు. ఐదు శతాబ్దాలుగా ఎదురుచూసిన భక్తుల కల నెరవేరడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులు అభిషేకాలు, పూజలు చేశారు. మరో వైపు రామనామ స్మరణ, భజనలతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి. సీతారామచంద్ర, లక్ష్మణుల విగ్రహాలతో ఊరేగింపులు నిర్వహించారు.
జై శ్రీరాం, జై జై శ్రీరాం అంటూ నినదించారు. పలుచోట్ల అన్నదానాలు, ప్రసాదాల వితరణతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. బాలరాముడి ప్రతిష్ఠను తిలకించేలా పలు ఆలయాల్లో నిర్వాహకులు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ఆసక్తిగా తిలకించారు. సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన నల్లగొండలోని రామగిరిలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ స్క్రీన్స్ పెట్టి భక్తులకు రామప్రతిష్ఠ మహోత్సవాన్ని చూపించి ప్రసాదాలు అందజేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరో వైపు మహిళలు తమ ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. రాత్రి ఇండ్ల ముందు ప్రమిదలతో దీపాలు వెలిగించి భక్తిభావం చాటుకున్నారు. వీటీకాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి సింధూర అభిషేకం చేయించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు తండు సైదులుగౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.