నల్లగొండ, ఆగస్టు 12 : గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించి నల్లగొండను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో ఈ నెల 14నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.
మాదక ద్రవ్యాల వాడకాన్ని నివారించాలనే ఆలోచనతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ గంజాయి వాడకం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, కొన్ని మెడికల్ షాపుల్లో ప్రిస్కిప్షన్స్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్నారని అన్నారు.
సినిమాల వల్ల, స్నేహితుల వల్ల యువత గంజాయికి బానిస అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని రూపుమాపడానికి మీడియా ప్రధాన బాధ్యత చేపట్టి గంజాయి వల్ల జరిగే అనర్థాలను వివరించాలని సూచించారు. ‘నేను గంజాయి వాడను’ అనే నినాదంతో యూట్యూబ్‌లు, పత్రికలు, చానళ్లలో ప్రసారం చేయడంతోపాటు వారం రోజులు ప్రతిఒక్కరూ డీపీ పెట్టుకోవాలని అన్నారు. జిల్లాలో గంజాయి వాడకం పెరుగుతుందని, నియంత్రించకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై వారం రోజులు జిల్లాలో అవగాహన కల్పించడంతోపాటు అనుమానం ఉన్నవారికి పరీక్షలు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలో 120 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని, ఇక నుంచి అన్ని శాఖల భాగస్వామ్యంతో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గంజాయి అమ్మినా, తీసుకున్నా, రవాణా చేసినా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
గంజాయి క్రయ, విక్రయాలు, సేవింపులు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 87126 70266కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ వినియోగం జరుగుతున్నదన్నారు. కామినేని దవాఖానలో రెండు రీహాబిలిటేషన్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. అంతకుముందు సైక్రియాటిస్ట్ శివరామక్రిష్ణ గంజాయి వల్ల జరిగే నష్టాలు, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. గంజాయిపై రాసే వార్తలపై డీపీఆర్వో వెంకటేశ్వర్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పాల్గొన్నారు.