ఒకప్పుడు బైక్ అంటే వంద సీసీనో, 125 సీసీనో. మరి ఇప్పుడు! 200 నుంచి 350కిపైన కూడా. గతంలో డ్రైవింగ్ అంటే అబ్బాయిలకు మాత్రమే పేటెంట్ అన్నట్టు ఉంటుండే. మరి నేడు! కుర్రకారుతో సమానంగా అమ్మాయిలూ టూ వీలర్, ఫోర్ వీలర్‌పై దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే యువతరం దగ్గర్నుంచి ఆచితూచి మైలేజీ, మెయింటెనెన్స్ వంటివన్నీ ఆలోచించే పెద్దవాళ్ల వరకు అందరి ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఆటోమొబైల్ రంగం వాహనాలను అందిస్తున్నది. ఇంతకుముందులా వెహికల్ కొనాలంటే హైదరాబాద్ వరకూ వెళ్లాల్సిన పని కూడా లేదు. నల్లగొండ జిల్లాకేంద్రం ఆటోమొబైల్స్‌కు కేరాఫ్‌గా మారింది. లగ్జరీ వెహికల్ షోరూమ్‌లు సైతం అనేకం ఇక్కడ వెలిశాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా టెక్నాలజీతో కూడిన అధునాతన వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నాయి. దాంతో నచ్చిన వెహికల్ కొనుగోలుకు యువతరం వెనుకడగు వేయడం లేదు. స్వరాష్ట్రంలో పెరిగిన వ్యవసాయం, కొనుగోలు శక్తితో వాహనాల కొనుగోలు కూడా జోరుగా సాగుతున్నది. కొవిడ్ పరిస్థితులు సైతం సొంత వాహనం ఉండాలన్న ఆలోచనను పెంచాయి. దాంతో మిడిల్ క్లాస్‌తోపాటు దిగువ మధ్యతరగతిలోనూ కొత్త వాహనాల కొనుగోలు పెరిగింది. అందుకు తగ్గట్టుగానే నల్లగొండ జిల్లాకేంద్రంలోని కార్లు, బైక్ షోరూమ్‌లు నిత్యం కిటకిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ గ్యారేజీలు వెలుస్తున్నాయి. ఆటోమొబైల్ రంగం ఉపాధి రెట్టింపు అయ్యింది.
2019 – 1,313
2020 – 1,418
2021 – 1,805
2022 – 1,650
(నవంబర్ వరకు)
నీలగిరి, డిసెంబర్ 8 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకూ దూసుకుపోతున్నది. ప్రభుత్వం చేపట్టిన పథకాల కారణంగా ఇటు భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ రంగం, అటు ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడి వ్యాపార రంగాలు జోడెడ్ల మాదిరిగా ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు కరోనా కారణంగా గుంపుల్లో కాకుండా స్వతహాగా వెళ్లాలనే ఉద్దేశంతో వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ అనుబంధ వాహనాలైన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వాహనాలు, ప్రజలకు తప్పనిసరిగా మారిన ఫోర్‌వీలర్స్, కనీస అవసరంగా మారిన ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఆర్థిక స్థోమతను బట్టి తమ పరిధిలో కొత్త కార్ల కొనుగోళ్లకు ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లా కేంద్రంతోపాటు వివిధ పట్టణాల్లోనూ రకరకాల కంపెనీల షోరూమ్‌లు ఏర్పాటయ్యాయి. అనుబంధంగా కార్ డెకార్స్, గ్యారేజీలు, ఇతర పలు ఫైనాన్స్‌లు వెలసి వేలాది మందికి ఉపాధి లభిస్తున్నది. కొత్త కొత్త మోడల్స్ బైక్‌లు మార్కెట్లోకి వస్తుండడంతో యువకులు వాటిపై క్రేజీతో స్పోర్ట్స్ బైక్‌లు, యువతులు స్కూటీలు కొనుగోలు చేస్తున్నారు. అంతేగాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా రోడ్లను అభివృద్ధి చేయడంతో ప్రయాణం కూడా సులువుగా ఉండడం, బ్యాంకులు కూడా రుణాలు అందిస్తుడడంతో ఎక్కువగా వాహనాల వైపు చూస్తున్నారు.
జిల్లాలో అన్ని కంపెనీల షోరూమ్‌లు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆటోరంగం దూసుకుపోతున్నది. జిల్లాలో ప్రస్తుతం సొంత వాహనాలపై యమా క్రేజ్ పెరిగింది. లోకల్‌గా రోజువారీ అవసరాల కోసం బైక్‌లను దాదాపు అందరూ వినియోగిస్తూనే ఉన్నారు. ఇక కుటుంబసమేతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం ఫోర్‌వీలర్లు తప్పనిసరిగా మారాయి. కరోనాకు ముందు సామాన్యులతోపాటు మధ్య తరగతి వారు ఆర్టీసీ బస్సులు, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్, ట్యాక్సీలపై వెళ్లేవారు. కానీ, కరోనా నాటి అనుభవాలతో కుటుంబంతో కలిసి ఎటైనా ప్రయాణించాలన్నా… హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా చిన్నదో, పెద్దదో ఓ సొంత వాహనం ఉండాల్సిందేనన్న అభిప్రాయం బలపడింది. తమ ఆర్థిక స్థోమతను బట్టి టూ వీలర్లు లేదంటే ఎక్కువ సంఖ్యలో ఫోర్ వీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
గతంలో ఎగువ మధ్య తరగతి వాళ్లే ఎక్కువగా కార్ల కొనుగోలు చేసే వారు. కానీ, సొసైటీలో వస్తున్న మార్పులతో ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నా.. పాతదో లేదంటే కొత్తదో ఏదో ఒక వాహనం కొనాలనే తాపత్రయం పెరిగింది. ఈ పరిస్థితులతోనే ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. చాలా వరకు కొత్త మోడల్స్ బైక్‌లు మార్కెట్లోకి వస్తుండగా వాటి విక్రయాల కోసం చిన్న చిన్న పట్టణాల్లో సైతం షోరూమ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని రకాల వాహనాల షోరూమ్‌లు జిల్లావ్యాప్తంగా వినియోగదారులకు చేరువయ్యాయి. ఇక కార్ల విషయంలో మాత్రం కొత్త కార్లకు విపరీతమైన డిమాండ్ పెరుగడంతో మంచి మోడల్స్ అన్నీ వెయిటింగ్ లిస్టులో ఉంటున్నాయి. గతంలో రెండు మూడు కంపెనీల కార్లపై మాత్రమే మార్కెట్లో ఎక్కువ ఆసక్తి కనపరిచే ప్రజలు ఇప్పుడు మిగతా అన్ని రకాల కంపెనీల కార్లను ఆదరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. కారు వాడకం అనేది తక్షణ అవసరంగా ఎక్కువ మంది భావిస్తున్నట్లు మార్కెట్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక ఇదే సమయంలో స్వరాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల నిర్వహణ మెరుగుపడడంతో ప్రయాణాలు కూడా సులువయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం బీటీ, సీసీ రోడ్లు అందుబాటులోకి రావడంతో వాహనాల కొనుగోళ్లు, వినియోగానికి మరింత ఊపునిచ్చే అంశంగా మారింది.
భారీగా పెరిగిన వాహన విక్రయాలు
కొవిడ్‌కు ముందుతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాల విక్రయం కనీసం 50 శాతం పెరిగినట్లు ఆయా కంపెనీల సేల్స్‌ను పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాలో పరిశీలిస్తే మార్కెట్ సేల్స్‌లో మెజార్టీ భాగం కొన్ని కంపెనీలదే ఉండగా, ప్రస్తుతం అన్నీ కంపెనీల వాహనాల సేల్స్ పెరిగాయి. కార్ల విషయాన్ని పరిశీలిస్తే..నల్లగొండలో 2019లో 1,313, 2020లో 1,418, 2021లో 1,805, ఈ సంవత్సరం నవంబర్ వరకు 1,650 వాహనాలను వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇక బైక్‌ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అందరూ వివిధ రకాల బైక్‌ల కొనుగోళ్లలో పోటీ పడుతున్నారు. ఎజ్డీ జావా, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కాస్ట్లీ బైక్‌లతోపాటు హీరో మోటార్స్, హోండా మోటార్స్‌కు చెందిన బైక్‌లకు వివిధ వర్గాల ప్రజల నుంచి ఫుల్ క్రేజ్ ఉంది. మహిళల బైకులకు సైతం విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రతి ఇంట్లో రెండు రకాల బైక్‌లు సాధారణంగా మారాయి. డిమాండ్‌కు తగ్గట్టే నల్లగొండలో కంపెనీ కార్ల విక్రయాల్లో 50 శాతం వృద్ధి కనిపిస్తుంది. ఇదే సమయంలో మారుతి సుజుకీ, నెక్సా, కియా, టాటా మోటార్స్, స్కోడా, హోండా, నిస్సాన్, కున్ బీవైడీ ఎలక్ట్రికల్ లాంటి కంపెనీల కార్ల సేల్స్ పెరిగినట్లు స్పష్టమవుతుంది.
వాహనదారుల్లో పెరిగిన అవగాహన
ఆర్థికంగా ఎంతో కొంత ఉన్న ప్రతి కుటుంబం సొంత వాహనం తప్పనిసరి అన్న భావనకు వచ్చేశారు. వాహనాల కోసం ఆన్లైన్ సెర్చింగ్, వెబ్సైట్లలో వెతుకులాట బాగా పెరిగినట్లు సమాచారం. ఇదే విధంగా ఆయా కంపెనీల మోడల్స్, వాటి ప్రత్యేకతలు, ఇతర మోడల్స్‌తో వేరియేషన్, ధరల్లో తేడాలు… ఇలా అనేక అంశాలను ఇంటర్నెట్ వేదికగా నిత్యం లక్షలాది మంది పరిశీలిస్తున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఎక్కువ మంది కార్ల పనితీరు, వాటిల్లో ఉండే సౌకర్యాలపై ఆరా తీసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్లో ఉన్న డిమాండ్‌కు తోడు రానున్న కాలంలోనూ వాహనాల కొనుగోళ్లు మరింత ఊపుందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వాహన రంగంలో పెరిగిన ఉపాధి
ఇక వాహనాల విక్రయాలు పెరుగడంతో వాటిపై ఆధారపడి నడిచే కార్ డెకార్స్, గ్యారేజీలకు కూడా గిరాకీ పెరిగింది. కొత్త వాహనం కొనుగోలు చేసేవారు వాటిల్లో అదనపు హంగుల కోసం కార్ డెకార్స్ను ఆశ్రయిస్తున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంటారు. సీట్ కవర్స్ మొదలు డెక్, స్పీకర్లు, మ్యాట్స్, రియర్‌వ్యూ మిర్రర్లు ఇలా ఎక్స్ట్రా ఫిట్టింగ్‌లకు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ పెరిగింది. గతంలో ఒకటి, రెండు డెకార్స్‌కు మాత్రమే డిమాండ్ ఉండగా, ప్రస్తుతం అన్ని డెకార్స్‌కు చేతి నిండా పని దొరుకుతుంది. దాంతో పాటు మరమ్మతులు లేదంటే యాక్సిడెంట్లకు గురయ్యే వాహనాలతో గ్యారేజీలు కూడా బిజీబిజీగా కనిపిస్తున్నాయి. కరోనా లాక్డౌన్లోని నష్టాన్ని అధిగమిస్తూ కారు డెకార్స్, గ్యారేజీలు, వీల్ అలైన్మెంట్ సెంటర్లు, ఫంక్చర్ కేంద్రాలు మంచి గిరాకీతో కళకళలాడుతున్నాయి. దీంతో వాటిపై ఆధారపడే వారికి అదనపు ఉపాధి కూడా లభించినట్లవుతోంది.
ట్రాక్టర్లకు భలే డిమాండ్
స్వరాష్ట్రంలో వ్యవసాయం విస్తృతంగా పెరుగడంతో అందుకు అనుగుణంగా యాంత్రీకరణ కూడా పెరిగింది. గత ఆరేండ్లుగా కరువంటూ లేక ఎక్కడ చూసినా సాగునీరు విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఓ వైపు గోదావరి, మరో వైపు కృష్ణా, మూసీ నీళ్లతో భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి. దీంతో పంటల సాగుకు ట్రాక్టర్ల అవసరం భారీగా పెరిగింది. జిల్లా పరిధిలో అన్ని రకాల ట్రాక్టర్ల షోరూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చిన్న పట్టణాల్లో సైతం వెలుస్తున్నాయి. ట్రాక్టర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. 2019లో 1,842, 2020లో 2,941, 2021లో 2,618, 2022లో నవంబర్ వరకు 2,804 అన్ని మోడల్స్ కలిపి విక్రయించారు.
ట్రాక్టర్ల మార్కెట్లో జిల్లాలో మహీంద్రా, జాన్‌డీర్, సోలీస్యాన్మార్ తదితర కంపెనీల వాహనాలకు మంచి గిరాకీ నెలకొంది. తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్ల కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు.
నూరు శాతం ఫైనాన్స్.. ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ
జిల్లాలో వాహనాలు కొనుగోలు చేసే కస్టమర్లకు అందుబాటులో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అతి తక్కువ వడ్డీకి అన్ని రకాల వాహనాలపై రుణాలు ఇస్తున్నాం. అందులోనూ వాహనాలను బట్టి, ఆయా కంపెనీల వ్యాల్యూ, కస్టమర్ల సిబిల్‌కు అనుగుణంగా రుణాలు అందజేస్తున్నాం. కస్టమర్లు వచ్చి కలిసిన అతి తక్కువ సమయంలోనే రుణాలు మంజూరు చేస్తున్నాం. కొన్ని కంపెనీలకు సంబంధించిన వాహనాలకు నూరు శాతం ఫైనాన్స్ సౌకర్యంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు విషయంలో కూడా రాయితీలు కల్పిస్తున్నాం. సిబిల్ రేటింగ్ బాగా ఉన్న వారికి అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం.
– జి.మురళీకృష్ణ, చీఫ్ మేనేజర్, ఎస్బీఐ, నల్లగొండ
బైక్‌లపై యూత్‌కు పెరిగిన క్రేజ్
యువతలో బైక్‌లపై బాగా క్రేజీ పెరిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతోపాటు విద్యాపరంగా అనేక వసతులు కల్పిస్తుండడంతో విద్యార్థులు ఎక్కువగా నల్లగొండలోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఇదే క్రమంలో యువతకు కావాల్సిన వాహనాలను అందుబాటులో ఉంచడంతో వారే స్వయంగా షోరూమ్‌లకు వచ్చి వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. త్వరలోనే ఐటీ హబ్ వస్తుండడంతో బైక్‌లపై మరింత మక్కువ పెరుగనున్నది.
– రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మల్లిక్ ఎజ్డీ షోరూం ఎండీ, నల్లగొండ
మారుతీ కొనుగోళ్లు భారీగా పెరిగాయి
గతంలో జనం ప్రజా రవాణాపై ఆధారపడేవారు. కార్ల కొనుగోళ్లపై ఆచితూచి వ్యవహరించేవారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగైంది. దానిక తోడు కరోనా నేర్పిన పాఠాలతో ప్రజల్లో కార్లు కొనుగోలు చేయాలనే ఆలోచన పెరిగింది. ప్రయాణాలు చేయాల్సి వస్తే ఎక్కువగా సొంత వాహనాల్లోనే వెళ్లేందుకు అసక్తి చూపుతుండడంతో జిల్లాలో కరోనా తరువాత మారుతీ కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు అందరూ కారు ఉండాలని చూస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే మా కంపెనీ కార్ల విక్రయం భారీగా పెరిగింది. కరోనా కాలంలోనే 500 కార్లకు పైగా సేల్ చేశాం. కరోనా కంటే ముందు అన్ని మోడల్స్ కలిపి నెలకు 100 కార్లు అమ్మితే ప్రస్తుతం 250 కార్ల వరకు విక్రయిస్తున్నాం.
– కోమటిరెడ్డి చంద్రపవన్రెడ్డి, పవన్మోటర్స్ ఎండీ, నల్లగొండ