సమస్యల వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రభుత్వ దవాఖానలపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారుల నుంచి మూడు జిల్లాల కలెక్టర్ల వరకు వివిధ సర్కారు ఆస్పత్రులను సందర్శించారు. వార్డులు, ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, రికార్డులను పరిశీలించారు. దవాఖానల్లో కలియదిరుగుతూ రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి సూపరింటెండ్లకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. దవాఖానల అవసరాలపై నివేదిక పంపాలని సూచిస్తూనే.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కాగా.. దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని పలు ఆస్పత్రుల డాక్టర్లు ఉన్నతాధికారుల ఎదుట వాపోయారు.
కేసులు ఎక్కువ ఉన్న గ్రామాల్లో జ్వర సర్వే చేపట్టాలి
ఆలేరు రూరల్, ఆగస్టు 14 : ఆలేరు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ హనుమంతు కె.జెండగే బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యుల కొరత, సమయపాలన పాటించని వైద్య సిబ్బంది, వసతులు, జ్వరంతో చికిత్స పొందుతున్న రోగులు, పరీక్షలకు సంబంధించిన కిట్స్, ర్యాపిడ్ టెస్ట్ వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు కావాల్సిన మందులు ఉన్నాయా.. లేవా? జ్వరానికి సంబంధించి ఏ ప్రాంతం నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి అని అడిగారు.
ఎక్కువ కేసులు వస్తున్న ప్రాంతంలో ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందితో ఇంటింటా జ్వర సర్వే చేసి రోగాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట సూపరింటెండెంట్ స్వప్నరాథోడ్, వైద్యులు రహీం, శిరీష ఉన్నారు. రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
దవాఖా సమస్యలపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
నీలగిరి, ఆగస్టు 14 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్స్, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలు, నిల్వ ఉన్న మందుల వివరాలు, టెస్టుల గురించి ఆరా తీశారు.
డాక్టర్ల సమయపాలన, కొరత, సిబ్బందిపై పనిభారంపై విచారణ చేశారు. ఏఏ మండలాల నుంచి జ్వర పీడితులు ఎక్కువగా వస్తున్నారో నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని ఆదేశించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు.. ప్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్ ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ రిపోర్టును పరిశీలించి టీ హబ్‌కు రోజు ఎన్ని టెస్టులు వస్తున్నాయి.. అన్ని పరీక్షలు చేస్తున్నారా? ఎక్కువ శాంపిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగారు.
మిర్యాలగూడ, దేవరకొండ, సాగర్ నుంచి ఎక్కువ శాంపిల్స్ వస్తున్నాయని నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. టెస్టుల్లో తప్పులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రోగుల పట్ల సౌమ్యంగా ఉండాలని, ఎవరినీ దుర్భాషలాడవద్దని సూచించారు. అనంతరం శానిటేషన్ సిబ్బంది, నర్సులు, ఏఎన్ఎంలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగుల విధుల నిర్వహణపై ఆరా తీశారు. రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణమూర్తి, జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్యాంసుందర్ జాదు ఉన్నారు.
రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సూర్యాపేట, ఆగస్టు 14 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందించి వ్యాధులను నయం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు ఉన్నాయా.. లేవా? అని సూపరింటెండెంట్‌ను అడిగారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా వైద్యం అందించాలన్నారు. టెస్టింగ్ కిట్స్, బెడ్లు, మందులు లేకుంటే తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, ఆర్ఎంఓ డాక్టర్ జనార్దన్, డాక్టర్ గిరిధర్ ఉన్నారు.
100 పడకల ఆసుపత్రికి త్వరలోనే పరిష్కారం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, స్టోర్ రూమ్‌ను పరిశీలించి మందుల స్టాక్ వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఆయిగిపోయిన విషయం జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో పరిష్కారం అవుతుందని కలెక్టర్ అన్నారు. రోగుల రక్త నమూనాలను జిల్లా ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్‌కుమార్, తాసీల్దార్ కంటమయ్య, ఎంపీడీఓ శేషుకుమార్, ఎంఈఓ బోయిన లింగయ్య ఉన్నారు.