ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా బయోమెట్రిక్ విధానానికి విద్యాశాఖ చర్యలు తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమలు చేస్తుండగా, విజయవంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 675 మంది బోధన, బోధనేతర సిబ్బంది నిత్యం బయోమెట్రిక్‌లో హాజరు వేస్తున్నారు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది సమయ పాలన పాటింపు, హాజరు శాతం పెరిగింది.
రామగిరి, డిసెంబర్ 21 : జూనియర్ కాలేజీల్లో సమయ పాలన, హాజరు నమోదుపై దృష్టి పెట్టిన విద్యాశాఖ.. 2016-17లో విద్యార్థులతోపాటు అందరికీ బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టింది. అయితే.. సాంకేతిక కారణాలతో అది ముందుకు సాగలేదు. అందులోని సమస్యలకు పరిష్కారం చూపుతూ 2022-23 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నూతన ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేసిన బయోమెట్రిక్ మిషన్లు అందజేశారు. దాంతో 2023-24 విద్యా సంవత్సరంలో జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమైన నాటి నుంచి రోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది ఉంటున్నారు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విజయవంతంగా కొనసాగుతున్నది. నిత్యం ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ సూచించిన సమయంలోనే హాజరవుతున్నారు. బయోమెట్రిక్‌తో రోజూ 6గంటల పాటు కళాశాలల్లోనే ఉండాల్సి ఉంటుంది. అంతకు తక్కువ సమయంలో బయోమెట్రిక్ వేస్తే ఒక పూట హాజరు పడుతుంది. కాబట్టి అంతా కచ్చితంగా సమయం పాటిస్తున్నట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ వెల్లడిస్తున్నారు. అదేవిధంగా తరగతుల నిర్వహణ సైతం టైం టేబుల్ ప్రకారం కొనసాగుతున్నట్లు చెప్తున్నారు.
ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. వారు సూచించిన విధంగానే 2023 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు విధులకు అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది సమయానికి వచ్చి బయోమెట్రిక్‌లో వేలిముద్రతో హాజరు వేస్తున్నారు. అటు విద్యతోపాటు ఇటు కార్యాలయంలో జరుగాల్సిన పనులు సమయ పాలనతో సాగుతున్నాయి. అంతేకాకుండా ఏ కళాశాలలో ఎవరు వచ్చారో ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉన్నది. దీంతో అధ్యాపకులు సమయం పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారు.
– దస్రూనాయక్, డీఐఈఓ, నల్లగొండ
ప్రత్యేకంగా బోధన, బోధనేతర సిబ్బందికి ఇంటర్ విద్యాశాఖ అందించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో నిర్ణీత సమయంలో మా కళాశాలలో హాజరు వేస్తున్నారు. రెగ్యులర్, కొంత మంది కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీతోపాటు బోధనేతర సిబ్బంది కూడా ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా 6గంటల సమయం కాలేజీలో ఉంటూ బయోమెట్రిక్ మిషన్‌తో హాజరు వేస్తున్నారు. ఆన్లైన్లో ఉన్నతాధికారులు చూసే అవకాశం ఉండడంతో అందరిలో కాస్త భయంతో సమయ పాలన పాటిస్తున్నారు. మరో వైపు తమకు కేటాయించిన సమయంతోపాటు అదనపు సమయం విద్యార్థులకు కేటాయిస్తూ అధ్యాపకులు అందుబాటులో ఉంటున్నారు.
– కలకోట నరేంద్ర, ప్రిన్సిపాల్, కేపీఎం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, నల్లగొండ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తేవడంతో బోధన, బోధనేతర సి బ్బంది సమయ పాలన పాటించడంతోపాటు హాజరు శాతం పెరిగింది. గతంలో ఆలస్యంగా వచ్చి నా రిజిస్ట్రార్‌లో సంతకం చేసేవారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో కచ్చితంగా అంద రూ ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బయోమెట్రిక్‌లో విధిగా హాజరు వేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరుతో ప్రిన్సిపాల్ నుంచి అధ్యాపకులు, కింది స్థాయి సిబ్బంది వరకు సమయపాలన పాటిస్తుండడంతో విద్యార్థులకు సమయానుకూలంగా తరగతుల నిర్వహణ సాగుతుంది. పర్యవేక్షణ పెరుగడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.