– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్
దేవరకొండ, మే 11 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు నమోదై మూడు రోజులైనా అరెస్టు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడుపై పొక్సో కేసు నమోదైనా నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉన్న వారిని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతుందన్నారు. గంగుల కమలాకర్ చేతిలో బండి సంజయ్ మూడుసార్లు ఓడిపోయాడు. రామ మందిరం పేరుతోనే బండి సంజయ్ గెలిచాడు తప్పా సొంత బలం ఏమీ లేదన్నారు. 2018కి ముందు తన రాజకీయ భవిష్యత్ కోసం భిక్షాటన చేస్తూ చందాలు వసూలు చేసిన బండి సంజయ్ కి నేడు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.
బండి రాజకీయ చరిత్ర అందరికీ తెలుసని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి తో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ బిజెపిని, ధర్మాన్ని తాకట్టు పెట్టుకుంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ధర్మం పేరుతో నీవు చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాలు టైం వచ్చినప్పుడు బయటపడతాయన్నారు. ఏనాటికైనా నిజం బయటపడుతుందన్నారు. ముసలి కన్నీరు కాదు, దేవుని పేరు చెప్పడం కాదు, ధర్మం పేరు చెప్పడం కాదు, వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల లోపు అమ్మాయిల మీద హనీ ట్రాప్ కేసు వర్తించదన్నారు. బాలికపై హనీ ట్రాప్ కేసు పెట్టడంలోనే బండి సంజయ్ చేసే అధికార దుర్వినియోగం తెలుస్తుందన్నారు. కేంద్రంలో బండి సంజయ్, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోలీసులను తమ కబంధ హస్తాల్లో పెట్టుకుని విచారణ జరగకుండా ఉల్టా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలిపారు.
బాలిక అత్యాచారం కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలన్నారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బిఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన అండగా ఉంటుంది అని ఆయన అన్నారు. ఉన్నోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? నిష్పక్ష విచారణ జరగాలంటే బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టు సాగుతున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాటకాలను త్వరలోనే బయట పడుతాయని పేర్కొన్నారు.