చిట్యాల, జూన్ 25 : బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా అధికార పార్టీ దాడులు చేస్తుందని, బీఆర్ఎస్ నాయకులను రాజకీయాలకు దూరం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రలు పన్నుతూ కేసులు పెడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం చిట్యాలలోని లక్షీ గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయపల్లి వాణి శ్రీనివాస్ గ్రామంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్మించుకున్న పాలీహౌజ్ను, గెస్ట్ హౌజ్‌ను రెవెన్యూ అధికారులు పోలీస్ బలగాలతో వచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగళవారం తెల్లవారుజామునే కూల్చివేసినట్లు తెలిపారు. తనకు ఉండాల్సిన భూమిలో తన అక్క లింగమ్మకు సంబంధించి 13 గుంటలు, తనకు సంబంధించిన 7 గుంటల భూమి తక్కువగా ఉందని, సర్వే చేయించి తన భూమి తనకే ఇప్పించాలని గతంలో కలెక్టర్, ఆర్డీఓ, తాసీల్దార్‌కు వినతిపత్రాలు సైతం ఇచ్చినట్లు తెలిపారు. బాధితుడికి న్యాయం చేయడం మరిచి బాధితుడి ఆస్తులనే ప్రభుత్వం లాక్కోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఈ విషయంపై తాము కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం పక్క వ్యక్తికి పట్టాలేకున్నా 34 గుంటల భూమి ఎక్కువగా ఉందని అది శ్రీనివాస్, తన అక్కకు సంబంధించిన భూమి అని తాసీల్దార్ తెలుపుతున్నాడని కానీ ఆస్తి నష్టం చేయించిన తర్వాత ఈ విషయం చెప్పడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బాధితుడికి తక్కువగా ఉన్న భూమిని ఇవ్వడంతో పాటు అతని భూమిలో కూల్చివేసిన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే తాసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రేస్ పాలనలో ఒక్క సమస్య పరిష్కరించకపోయినా విపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో అక్రమ మట్టి తరలింపు జోరుగా సాగుందని, ఓ నాయకుడి ఆధ్వర్యంలో ఈ అక్రమ దందా నడుస్తుందని ఆరోపించారు.
కోర్టు చెప్పే వరకు స్థానిక ఎన్నికలు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అమలు చేయని 420 ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని చిరుమర్తి కోరారు. ఈ సమావేశంలో బాధితుడు బోయపల్లి శ్రీను, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, పొన్నల లక్ష్మయ్య, కోనేటి యల్లయ్య, జనగాం నర్సింహ్మ, ఆగు అశోక్, కొలను సతీశ్, కందాటి రమేశ్‌రెడ్డి, జిట్ట శేఖర్, జోగు శ్రీకాంత్ పాల్గొన్నారు.
బోయపల్లి శ్రీనుకు నోటీస్ ఇచ్చిన తర్వాతే ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో ఆయన నిర్మాణాలు చేసినందున తొలగించినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన భూమి సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేసినట్లు తాసీల్దార్ కృష్ణ తెలిపారు.