కోదాడ, నవంబర్ 13 : నిర్మల్ కోర్టులో ఒక కేసులో నిందితులను సరెండర్ చేస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ కారుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సంఘటనను ఖండిస్తూ గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు తమ విధి నిర్వహణలో భాగంగా సరెండర్ చేస్తుంటే, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం శోచనీయమన్నారు. న్యాయవాది అనిల్ కుమార్ను దుర్భాషాలాడుతూ కులం ప్రస్తావన తెచ్చి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కోర్టు ప్రాగణంలోనే అతడి కారును ధ్వంసం చేయడం అత్యంత దారుణం అన్నారు. పోలీసుల దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
న్యాయవాదుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడంలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నాని, ఈ దాడులు న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యంపై జరిగే దాడిగా భావించాలన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. అనిల్ కుమార్ కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు నాగుబండి కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, నయిమ్, హుస్సేన్, నవీన్, చలం, కె.మురళి, సీనియర్ న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, రంజాన్ పాషా, ఈదుల కృష్ణయ్య, యశ్వంత్ రామారావు, ఉదారు శ్రీనివాస్, నాళం రాజన్న, రియాజ్, దొడ్డ శ్రీధర్, తాటి మురళి, గోవర్ధన్, మీరా, బాలయ్య, శరత్, పాషా, శ్రావణ్, శిల్ప పాల్గొన్నారు.