నల్లగొండ, జూలై 16 ; ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోనూ సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వానలు లేక కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బీడువారిపోయాయి. అసలు ఈ ఏడాది చెరువుల్లోకి నీరే చేర లేదు. ఇంకో వైపు వాగులు, వంకలు వట్టిపోయాయి. వర్షాలు, నీరు లేక వ్యవసాయ పనులు కూడా ముందుకు సాగడం లేదు. దాంతో రైతుల సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 11.40 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.75 లక్షల ఎకరాల్లోనే సాగు అయ్యాయి. అందులో పత్తి 3.46 లక్షల ఎకరాలు, వరి 15వేల ఎకరాల్లోనే సాగు అయ్యింది. వర్షపాతం ఈ నెలలో 16.89 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.46 సెంటీమీటర్లు మాత్రమే పడింది. జూన్ కంటే ఎక్కువ వర్షం పడినప్పటికీ అప్పటికి రైతులు ఎలాంటి సాగు ఆలోచన చేయకపోవడంతో పంటల సాగు గణనీయంగా తగ్గింది. కనీస వర్షపాతం నేపథ్యంలో గత యాసంగిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా పట్టించుకోదనే ఆలోచనతో పంటల సాగులో రైతులు ముందుకు రాకపోవటం గమనార్హం.
పత్తి రైతుల పరిస్థితి అగమ్య గోచరం
జిల్లాలో వానకాలం సీజన్లో ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ప్రతి ఏటా ఈ సీజన్లో ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతండగా ఈ సారి లోటు వర్షపాతం కారణంగా ఇప్పటి వరకు 3.46 లక్షల ఎకరాల్లోనే సాగు అయ్యింది. వర్షాలు లేక విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఒకటికి రెండు సార్లు విత్తనాలు తీసుకొచ్చి విత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. విత్తనం మొలకెత్తకపోవటంతో కొందరు రైతులు ఆ పంటను వదిలేయగా.. కొంచెం కొంచెం వచ్చిన మొలకలు బతుకుతాయా చస్తాయా అనే డైలామాలో పడ్డారు. ఇప్పటి వరకు విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవటంతో మిగిలిన రైతులు ఆ పంట జోలికే పోకుండా ఉన్నారు. ఇక వరి సాగు చేద్దామని నారు మళ్లు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు వేద్దామంటే సమృద్ధి వర్షాలు పడక పోవటంతో ముందుకు రాని పరిస్థితి.
వర్షపాతం లెక్కల్లో గందర గోళం
ఈ సీజన్లో ఇప్పటి వరకు 146.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 195.2 మిల్లీమీటర్ల వర్షం పడి 33శాతం అదనపు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 33శాతం అదనపు వర్షపాతం నమోదైతే 11.40 లక్షల ఎకరాలకు గానూ ఇప్పటి వరకు 3.75 లక్షల ఎకరాల పంటలు మాత్రమే ఎందుకు సాగయ్యాయి? సమృద్ధిగా వర్షాలు పడితే జిల్లాలో ఉన్న 1927 చెరువుల్లో నీరెందుకు లేదు? సగటు గ్రౌండ్ వాటర్ ఇంకా 10 మీటర్ల కిందనే ఎందుకు ఉన్నది? అనే ప్రశ్నలకు వాతావరణ శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. ఏదో ఒక గ్రామంలో పడ్డ వర్షాన్ని పరిగణలోకి తీసుకొని మండల యూనిట్‌గా.. ఒక మండలంలో పడ్డ వర్షాన్ని జిల్లా యూనిట్‌గా తీసుకొని వాతావరణ శాఖ యంత్రాంగం లెక్కలు వేసి అధిక వర్షపాతం పడిందని ప్రభుత్వానికి నివేదించి తప్పుదోవ పట్టిస్తుందనేది తోసి పుచ్చలేని అంశం.
బోర్లు, బావులే దిక్కు..
వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి, భూములను సిద్ధం చేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొన్ని చోట్ల వరి పోసినా చేతికి రాకుండా పోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. పత్తి పంట వేసినా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్లు, బావులే ఆధారం కానున్నాయి. గత యాసంగి సీజన్లోనే అనేక చోట్ల సాగునీరు లేకపోవడంతో ట్యాంకర్లతో పోసిన ఘటనలు తెలిసిందే.
అడుగంటుతున్న చెరువులు
ఉమ్మడి జిల్లాలో చెరువులు దాదాపు అని ఎండిపోయే దశకు వచ్చాయి. అనేక చోట్ల చుక్క నీరు కూడా లేదు. మొత్తంగా పరిశీలిస్తే సగటున చెరువుల్లో 25శాతం నీళ్లు కూడా లేవు. ఈ సీజన్లో అసలు చెరువుల్లోకి నీళ్లు చేరేంత వర్షాలు పడలేదు. ఇప్పుడున్న నీళ్లు కూడా గతేడాది నింపినవే కావడం గమనార్హం.
ఈ నెల వరకు పంటల సాగుకు అనుకూలం
జిల్లాలో ఇప్పటి వరకు ఈ వానకాలం సీజన్లో 3.75 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు అయ్యాయి. పత్తి 3.46 లక్షల ఎకరాలు, వరి 15వేల ఎకరాల్లో సాగు అయ్యింది. ఇంకా రెండు లక్షల ఎకరాలకు వరి నారు రైతులు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు ఆలస్యమైనా ఈ నెల వరకు పంటల సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ
ఇంకా నారే పోయలేదు..
మఠంపల్లి తీగల చెరువు గత పదేండ్లుగా ఎప్పుడూ ఎండిపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులో పూడిక తీయించి మరమ్మతులు చేయించింది. చెరువు కింద పుష్కలంగా పంటలు పండాయి. కానీ ఇప్పుడు నీళ్లు లేక బీడువారింది. వానకాలం సీజన్ మొదలైనా వర్షాలు లేక చెరువులోకి నీళ్లు రాలేదు. ఇప్పుడు నాట్లు వేసే సమయం కానీ ఇంత వరకూ నారే పోయలేదు. సమైక్య రాష్ట్రంలోనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నది.
-మన్నెం నర్సారెడ్డి, రైతు, మఠంపల్లి