భువనగిరి కలెక్టరేట్, మే 21 : ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల కో ఆర్డినేషన్ కమిటీ అధికారులతో సమావేశమై పరీక్షల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రథమ సంవత్సరం 3,682 మంది, ద్వితీయ సంవత్సరం 2,297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్షల నిర్వహణకు సెంటర్కు ఒకరు చొప్పున 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్స్ను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు సకాలంలో తీసుకొచ్చి, పరీక్ష అనంతరం వారిని తిరిగి తీసుకెళ్లేలా బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి, పరీక్షల కో ఆర్డినేటర్ అరుంధతి, పోస్ట్మాస్టర్ బాలనరేశ్, డాక్టర్ వంశీకృష్ణ, విద్యా శాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈ సత్యప్రకాశ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి, ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ యాదగిరి పాల్గొన్నారు.